
*Bayalu veerabadra swamy pooja
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం మంగళవారం సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపింది.
ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలు వీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు.
బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపులో కుడివైపున దక్షుడు, ఎడమవైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆగమ సంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేష స్థానం ఉంది. క్షేత్ర పాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభ ఫలితాలు చేకూరుతాయి.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు