పుంజుకున్న కాళేశ్వరం భూసేకరణ :
షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్న పనులు :
భూసేకరణపై సీఎం పర్యవేక్షణ :
మంత్రి హరీశ్ రావు నిరంతర సమీక్ష:
కాళేశ్వరం పనులను రేపు(గురువారం) సమీక్షించనున్న మంత్రి :
సిఇ, ఎస్ఇ , ఇఇలు, కాంట్రాక్టర్లతో కీలక సమావేశం :
————————
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ పుంజుకున్నది. భూసేకరణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. జిల్లాల పునర్విభజన అనంతరం ఏడు జిల్లాల పరిధిలో ఈ భారీ ప్రాజెక్టు నిర్మితమవుతున్నది.
మేడిగడ్డ , సుందిళ్ళ, అన్నారం బ్యారేజీ లు, పంప్ హౌజ్ లతో పాటు మిడ్ మానేరు, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గురువారం జల సౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సమావేశాన్ని మంత్రి హరీశ్‌రావు తలపెట్టారు. భూసేకరణ పనులతో పాటు ఇతర నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించనున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లతో పాటు ఎస్ఇ, ఇఇలు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల , అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ సంకల్పించింది. ఇరిగేషన్, రెవిన్యూ అధికార యంత్రాంగo సమన్వయంతో ఈ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు నిరంతరం ఇరిగేషన్ శాఖ అధికారులను కోరుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.ప్రాజెక్టు భూసేకరణ పై వివిధ జిల్లాల కలెక్టర్ లు, రెవిన్యూ అధికారులను మంత్రి పరుగులు పెట్టిస్తున్నారు.భూసేకరణ ప్రక్రియ ప్రధాన సమస్య అని ముందుగా దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరుతున్నారు. మంత్రి ఆదేశాలతో గ్రామసభలు నిర్వహించి ప్రజల్ని ఒప్పించి భూసేకరణను వేగవంతం చేస్తున్నట్టు కాళేశ్వరం సి.ఇ. నల్ల వెంకటేశ్వర్లు మంగళవారం నాడు తెలిపారు. బ్యారేజీ, పంపు హౌజ్ ల సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులన్నీ ఏకకాలంలో జరగాలని మంత్రి సూచించిన విధంగా సమీకృతంగా పనులు పూర్తయ్యలా ప్రయత్నిస్తున్నట్టు సి . ఇ చెప్పారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇదివరకే చేపట్టిన ప్యాకేజీలు 6 , 7 , 8 , 9 లలో భూసేకరణ పూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులుమరింత ఊపందుకోనున్నాయి. ఈ ప్రాజక్టులో అంతర్భాగంగా గతంలో ప్రారంభించిన పంపుహౌజ్ ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు చేపట్టిన ప్యాకేజీ – 6, ప్యాకేజీ – 8 లకు చెందిన పంపు హౌజ్ ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నది. ప్యాకేజీ – 10, 11, 12 ల పంప్ హవుజ్ లను 2017 సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యాన్ని విధించారు.ప్యాకేజీ – 20 పంప్ హౌజ్ నిర్మాణాన్ని 2017 డిసెంబర్ లో పూర్తి చేయవలసి ఉన్నది.