రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఛైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, డాక్టర్ ఆంజనేయులు గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు.
బీసీ కమిషన్ ఏర్పాటు సంతోషకరమన్నారు మంత్రి జోగు రామన్న. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసమే బీసీ కమిషన్ ఏర్పాటైందని చెప్పారు. బీసీల స్థితిగతులపై ఈ కమిషన్ లోతుగా అధ్యయనం చేస్తుందన్నారు.
కులాల మధ్య అంతరాలు తొలగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ బీసీ సంక్షేమం కోసం కమిషన్ ను వేశారని చెప్పారు. బీఎస్ రాములు సారథ్యంలో బీసీ కమిషన్ చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలన్నారు. బీసీల సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని, బీసీల్లోని అన్నికులాలకు న్యాయం జరిగేలా కమిషన్ నివేదిక ఉండాలని సూచించారు.
ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంతో సరైన లెక్కలు లేవని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీలు బీసీలను ఓటర్లుగానే చూశాయని అన్నారు. బీసీలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి రాజేందర్ భరోసానిచ్చారు. బీసీల సంక్షేమం కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి వర్తింపజేస్తున్నామని తెలిపారు.
బీసీల అభ్యున్నతి కోసం కమిషన్ పనిచేస్తుందన్నారు ఎంపీ వినోద్. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన బీసీ కమిషన్ సభ్యులకు ఎంపీ సుమన్ శుభాకాంక్షలు చెప్పారు.
బీసీ కమిషన్ సభ్యులంతా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తామని ప్రతిన బూనారు.