దేవాదాయ శాఖపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశం
తెలంగాణలో దేవాలయాలకు పున:వైభవం
అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి
దేవాదాయ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. జీత భత్యాల విషయంలో దేవాదాయ శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ నివేదికపై క్షుణ్ణంగా చర్చించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖను పటిష్ఠ పరచడం, అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో భేటీ అయింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు నాయిని నర్సింహ రెడ్డి, జూపల్లి కృష్ణ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీత భత్యాలు ప్రధాన ఎజెండగా చర్చించారు. ఎస్టాబ్లిష్ మెంట్ ఎక్స్పెండిచర్ 30 % లోగా ఉన్న ఆలయాలెన్ని, 30% మించిన ఆలయాలెన్నిఉన్నాయో వివరాలను తెలుపుతూ, ఒప్పంద ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ , రోజు వారీగా వేతనాలు తీసుకుంటున్న సిబ్బంది వివరాలన్నింటిని అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది.
దేవాదాయ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించుకోవవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఆలయాల వారీగా దేవాదాయ శాఖ భూమలు వివరాలను అందించాలని క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను కోరింది. దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటునే , వాటి నుంచి ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రభుత్వంపై ఆధారపడకుండా దేవాదాయ శాఖ భూములను అభివృద్ది చెసుకుని, స్వయం సంవృద్ది సాధించాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.
దేవాదాయ ట్రిబ్యునల్ ఆదేశాల అమలుకు చర్యలు
దేవాదాయ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. అవసరమైతే జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సహాయం తీసుకావాలని సూచించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఇప్పటి వరకు జరుగుతున్న జాప్యాన్ని నివారించేలా సూచనలు చేయాలని వెల్లడించింది. అంతే గాకుండా దేవాదాయ శాఖకు సంబంధించి వివిధ కోర్టుల్లో దాఖలయ్యే వ్యాజ్యాలపై వాదనలు వినిపించేందుకు లీగల్ సెల్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. దీనితో పాటు విజిలెన్స్ సెల్ ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది.
దూప దీప నైవేద్య పథకం
దూప దీప నైవేద్యం పథకాన్ని కొత్తగా మరిన్ని ఆలయాలకు వర్తింపజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆలయాల వారీగా నివేదికలను సిధ్దం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. దూప దీప నైవేద్యం కింద గతంలో రూ. 2 వేలు ఇవ్వగా , తెలంగాణ ప్రభుత్వం దాన్ని రూ. 6 వేలకు పెంచింది. దేవాదాయ శాఖ దూప దీప నైవేద్య పథకం కింద ప్రస్తుతం 1805 ఆలయాలకు నెలకు రూ.1.08 కోట్లను గౌరవ వేతనంగా చెల్లిస్తుంది.
దేవాదాయ చట్ట సవరణకు సూచనలు
ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖ చట్టానికి సవరణలు చేయాలనే యోచనలో క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. ఆదాయాన్ని బట్టి దేవాలయాల హోదా పెంపుపై సవివరమైన నివేదికను రూపోందించి క్యాబినెట్ సబ్ కమిటీ ముందుంచాలని అధికారులకు సూచించింది. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల కామన్ గుడ్ ఫండ్ కింద వీకర్ సెక్షన్ కాలనీలో నిర్మించే ఆలయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని , దీనికి ఉత్తమమైన విధానాన్ని రూపోందించాలని అధికారులను ఆదేశించింది.
వీటితో పాటు దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందున ,భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కమిటీ స్పష్టం చేసింది. వసతి సౌకర్యాలతో పాటు ఆలయ పరిసరాల్లో శుభ్రత కూడా ముఖ్యమని కమిటీ వెల్లడించింది. మరోవైపు దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని సూచించింది.
మంత్రి వర్గ ఉప సంఘ సమావేశంలో ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్లు కృష్ణవేణి, శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.