క్షేత్ర స్థాయి లో జిల్లా జాయింట్ కలెక్టర్లు రైతుల కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలనీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు.
మంగళవారం సచివాలయం సి బ్లాక్ నుండి జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మద్దతు ధర కొనుగోలు కేంద్రాల పై సూచనలిచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత సంవత్సరం దళారుల ప్రమయం లేకుండా 27.52 లక్షల పత్తి రైతులకు బార్ కోడ్ తో ఉన్న కార్డుల ను మంజూరు చేయడం జరిగిందని తద్వారా రైతులకు ఆన్ లైన్ లో చెలింపులు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది 90 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మొదటి దశ లో 45 కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు. ఖమ్మం, కొత్తగూడం, పెద్దపల్లి, జనగాం, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రాలు, వరంగల్ (అర్బన్), నిర్మల్, మంచిరియల్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగార్ కర్నూల్, జిల్లాలలో రెండు కేంద్రాలు, కొమరం భీం, నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి లో మూడు, ఆదిలాబాద్ లో ఐదు, సిద్దిపేట లో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అయన తెలిపారు. ప్రతి జిల్లాలోని మార్కెట్ యార్డ్ కార్యకలాపాల పై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మార్కెట్ యార్డ్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని, క్షేత్ర స్థాయి లో రైతులకు వసతులు అందించడం లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాలకు అవసరం ఉన్న పరికరాలను సేకరించడం జరిగిందని, ఈ సంవత్సరం పరికరాల కొనుగోలు కు ముందు గత ఏడాది కొనుగోలు చేసినవి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ యార్డులకు వచ్చే పంట ఉత్పత్తుల పై పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. ఖరీఫ్ ఉత్పత్తులు అధికంగా మార్కెట్ కు వచ్చే సమయం లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలలో తగు చర్యలు చపటాలని సూచించారు. అక్టోబర్ నుండి మొక్కజొన్న, సోయాబీన్, నవంబర్ మాసం లో వరి, పత్తి, కందులు ఉత్పత్తులు జనవరి నుండి మార్కెట్ కు చేరుతాయని అయన తెలిపారు. ఈ ఏడాది 195 మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలు, వరి 1900 కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లా లో ఈ కేంద్రాల వివరాలను రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలనీ అయన ఆదేశించారు. సోయాబీన్ పంట కు గ్రేడ్ -ఏ రకానికి క్వింటాల్ కు రూపాయలు 2775 మద్దతు ధర గా , గ్రేడ్- బి కి క్వింటాల్ కు రూపాయలు 2400 నిర్ణయించడం జరిగిందని అయన తెలిపారు. వరి పంట సాధారణ రకానికి క్వింటాల్ కు రూపాయలు1470, గ్రేడ్ -ఏ 1510, మొక్కజొన్న క్వింటాల్ కు రూపాయలు 1365 నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ సమావేశం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ ఏం. జగన్ మోహన్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మి బై, తదితరులు పాల్గొన్నారు.