తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పలు శాఖల్లో ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 2వేల 109 ఉద్యోగాలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవిన్యూ శాఖలో 2109 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో కలెక్టరేట్లకు 693, రెవిన్యూ డివిజన్లకు 188, మండలాలకు 1228 పోస్టులను కేటాయించింది. వీటితో పాటు 85 మండల విద్యాశాఖ అధికారులు, ఆర్ అండ్ బీలో 12 పోస్టులకు ఆమోదం తెలిపింది.
జిల్లా కలెక్టరేట్ పోస్టుల్లో జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్వో) 12, తహశీల్దార్ కేడర్ 98, డిప్యూటీ తహశీల్దార్ కేడర్ 4, సీనియర్ స్టెనోగ్రాఫర్లు 21, జూనియర్ స్టెనోగ్రాఫర్లు 21, సీనియర్ అసిస్టెంట్లు 180, జూనియర్ అసిస్టెంట్లు 60, రికార్డ్ అసిస్టెంట్లు 42, డ్రైవర్లు 42, ఆఫీస్ సబార్డినేట్లు 139, జమేదార్లు 21, చౌకిదార్లు లేదా వాచ్ మన్ పోస్టులు 53 ఉన్నాయి.
రెవిన్యూ డివిజన్ స్థాయిలో డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) 24, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 24, డిప్యూటీ తహశీల్దార్లు 6, సీనియర్ అసిస్టెంట్లు 12, జూనియర్ అసిస్టెంట్లు 2, రికార్డ్ అసిస్టెంట్లు 24, డ్రైవర్లు 24, డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్లు 24, చైన్ మన్లు 24, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 24 పోస్టులు ఉన్నాయి.
మండల స్థాయిలో తహశీల్దార్లు 104, డిప్యూటీ తహశీల్దార్లు 104, మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్లు/సీనియర్ అసిస్టెంట్లు 232, జూనియర్ అసిస్టెంట్లు 120, మండల సర్వేయర్లు 120, ఆఫీస్ సబార్డినేట్లు 308, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 120, చైన్ మన్లు 120 పోస్టులు ఉన్నాయి.