మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ఆదివారం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలవుతుంది. చరిత్రలో మొదటి సారిగా బీసీల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ కారక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీని ప్రకారం విదేశాల్లో విద్యావకాశాలు వచ్చే విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదటి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.60 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.