ముసాయిదా నోటిఫికేషన్ లో ప్రకటించిన 17 కొత్త జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపి కె. కేశవరావు నాయకత్వంలోని కమిటీలో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. ముసాయిదా నోటిఫికేషన్ లో 17 కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం హై పవర్ కమిటీని కోరింది. ప్రజల డిమాండ్ మేరకు ఈ నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయవచ్చా? అనే అంశాలపై కమిటీ అధ్యయనం జరిపి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు నివేదిక అందివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల డిమాండ్ల పరిశీలనకు అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా ప్రక్రియను ముగించాలని హై పవర్ కమిటీని ముఖ్యమంత్రి కోరారు.