హైదరాబాద్ లో వరదల వల్ల కలిగిన నష్టానికి కేంద్రం ఆదుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు.
మంత్రి కెటిఆర్ గురువారం నాడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమేవేశమయ్యారు. ఢిల్లీలోని పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయిన మంత్రి రాష్ట్ర రాజధాని సహా తెలంగాణలోని మున్సిపాలిటీల్లో అపారమైన వర్షం వల్ల కలిగిన నష్టానికి కేంద్రం నుంచి 1189 కోట్లు సహాయం అందించాలని కోరామన్నారు. అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. వరదల సమయంలో ముందుండి ఆదుకున్నందుకు, నాళాలపైన అక్రమకట్టడాల కూల్చి వేతకు గానూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు ప్రశంసించారని ఆయన తెలిపారు. తనతో సహా తమ పార్టీకి చెందిన కార్పోరేటర్లు, నేతలు వద్దన్నా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఈ సంధర్బంగా ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు నాళాలు, చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఐదు వందలు పైచిలుకు కట్టడాలను కూల్చి వేశామని ఆయన తెలిపారు.
ఇరవైఎనిమిది వేల అక్రమ కట్టడాలున్నాయని కిర్లోస్కర్ కమిటీ చెప్పిందని చివరి అక్రమ కట్టడం వరకు కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు.