తెలుగు భాష ప్రాచీన హోదాకు ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయిన నేపథ్యంలో త్వరలోనే మైసూర్లో ఉన్న భాషాభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్కు తరలించే ప్రయత్నం ముమ్మరం చేశామని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీలతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
తెలుగు బాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా చైతన్యోద్యమం’ గ్రంథావిష్కరణ సభ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది. ఆవిష్కర్త ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ.. అక్టోబరు 2వ తేదీ తరువాత అన్ని దినపత్రికల సంపాదకులు, ఎలక్ట్రానిక్ మీడియా సీఈవోలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. భాషాభివృద్ధి కేంద్రం కోసం తెలుగు వర్సిటీకి సంబంధించిన 20 ఎకరాల స్థలం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగు దీపం ఏనాడూ ఆరిపోదన్నారు. అనాడు ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ, ఆంధ్ర మహాసభలు భాషాభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు.తెలుగు భాష అన్ని స్థాయిల్లో అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోందన్నారు. సీనియర్ జర్నలిస్టు డా.జి.ఎస్.వరదాచారి అధ్యక్షోపన్యాసం చేశారు. సమితి ప్రధాన కార్యదర్శి గురజాల విజయకుమార్ నివేదికను సమర్పించారు. సభలో చలసాని శ్రీనివాస్, సాహితీవేత్తలు వసుంధరరెడ్డి, మంగళగిరి ప్రమీలాదేవి పాల్గొన్నారు.