

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ధర్మకర్తల మండలి నిర్ణయించిందని అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు. పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షన ధర్మకర్తల మండలి సమావేశం గురువారం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈనాటి సమావేశంలో మొత్తం 42 అంశాలను చర్చించారు. వీటిలో 39 అంశాలను ఆమోదించగా, 2 అంశాలను వాయిదా వేసారు. ఒక అంశాన్ని తిరస్కరించారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మీడియాకు వివరించారు.
• సామాన్య భక్తులకు సౌకర్యార్థం తిరుమలలోని పి.ఎ.సి – 5 తరహాలో పబ్లిక్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం.
• సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు , ప్రభుత్వ సెలవురోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని నిర్దిష్టవేళలో కేవలం ఉదయం , రాత్రి మాత్రమే కల్పించేదుకు నిర్ణయం. మిగిలిన సమయమంతా కూడా అలంకార దర్శనానికి అవకాశం కల్పించడం.
• దాత చేత శ్రీమల్లికార్జునస్వామివారి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం ఏర్పాటుకు నిర్ణయం.
• శ్రీశైలంలో పర్యాటక , రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా సీప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికిగాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికిగాను 1.06 సెంట్ల స్థలాన్ని కేటాయించటానికి ఆమోదం.
• దేవస్థానములో వివిధ అభివృద్ధి పనులకు , మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించి తదుపరి సమావేశంలో చర్చించేందుకు నిర్ణయం.
• ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామివారి పాకశాలను ఆలయ సంప్రదాయరీతిలో కళాత్మకగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంటల్ పనులకు ఆమోదం.
• ఆలయ ప్రాంగణములోని శ్రీ అమ్మవారి పాకశాలను ఆలయ సంప్రదాయరీతిలో కళాత్మకగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంటల్ పనులకు ఆమోదం.
• క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకనుగుణంగా బి.ఓ.టి ( బిల్ట్ – ఆపరేట్ – ట్రాన్సఫర్ ) పద్దతిలో పబ్లిక్ టాయిలెట్స్ , స్నానపు గదుల నిర్మాణానికి నిర్ణయం
• శ్రీశైల దేవస్థానం క్షేత్ర పరిధిలోని శౌచాలయాలను , స్నానపు గదులను రెండు సంవత్సరాల కాలపరిమితితో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహింపజేయాలని తీర్మానించడం.
• ఘంటామఠ పునరుద్ధరణ సమయంలో లభించిన నూతన తామ్ర శాసనాల వివరణ , విశ్లేషణలను గ్రంథరూపములో ముద్రించేందుకు ఆమోదం.
