హైదరాబాద్ : జనవరి 27 : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డిజిపి మాట్లాడుతూ… ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాల పంపిణీని అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతామన్నారు. 50 వేల రూపాయల కన్నా ఎక్కువ నగదును తీసుకు వెళుతున్నట్లయితే తగిన ఆధారాలు చూపించాలని, లైసెన్స్ కలిగిన ఆయుధాలన్నీ వెంటనే డిపాజిట్ చేయాలని, అక్రమ ఆయుధాల ఏరివేతకు ప్రత్యేక సోదాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా 1800 ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లో అప్పగించారని తెలిపారు.పాత నేరస్తులు, రౌడీషీటర్లు, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి ఆర్థిక పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో 24/7 పని చేసేలా ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 1000కి పైగా ఉన్న అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజల్లో భరోసా కల్పించేందుకు సాయుధ బలగాలతో ‘ఫ్లాగ్ మార్చ్’ నిర్వహిస్తామని డీజీపీ ప్రకటించారు.
రాష్ట్రంలో రెండో విడత సాధారణ పురపాలక ఎన్నికల కింద మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుందని డిజిపి వివరించారు. కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డులతో పాటు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు.ఈ ప్రక్రియను అమలు చేసేందుకు స్థానిక పోలీసులకు అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీజీఎస్పీ) మరియు ఇతర విభాగాల బలగాలను మోహరిస్తున్నట్లు డిజిపి తెలిపారు. పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది కాకుండా ఎక్సైజ్ , ఫారెస్ట్ శాఖలకు సంబంధించిన రెండు వేల మంది బందోబస్తు కోసం అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక పహారాతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల నుంచి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు మరియు కౌంటింగ్ హాల్స్ వరకు ప్రోటోకాల్ ప్రకారం అంచెలంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, భయం లేని వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది పహారా ఉంటుందని డిజిపి బి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం భగవత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
