హైదరాబాద్ : రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలింను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేజన ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ గురవారెడ్డి, సీఈఓ, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ బి. జనార్ధన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం తాము చేపడుతున్న రోడ్డు భద్రతా కార్యక్రమాలను డిజిపికి వివరించారు. రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఫౌండేషన్ రూపొందించిన ప్రత్యేక రోడ్డు భద్రత స్టిక్కర్‌ను, అలాగే వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు నిర్మించిన ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలిం ను డిజిపి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రహదారి భద్రత కోసం స్వచ్ఛంద సంస్థలు పోలీసు శాఖతో కలిసి పని చేయాల్సిన ఆవశ్యకతను ఈ భేటీ సందర్భంగా ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ అనిల్ గొర్రె, రోడ్డు సేఫ్టీ మేనేజర్ సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.
