శ్రీశైల దేవస్థానం:
• భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు
• ఈ సంవత్సరం భక్తులకు ఉచిత దర్శనం
• భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాల వితరణ
• పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం
– కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు
శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతీ క్షేత్రంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న వసంత పంచమి మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ , శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో , శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు , సభ్యుల సలహా సూచనలకు అనుగుణంగా ఆయా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ నెల 10వ తేదీన నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆధ్వర్యములో డివిజన్ స్థాయి అధికారుల సమన్వయ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పలువురు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పలువురు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు కూడా పాల్గొన్నారన్నారు.
సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆయా ఏర్పాట్లన్నీ చేస్తున్నామన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా ఏర్పాట్లన్నింటిని కూడా పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు.
గతంలో దర్శనానికి రూ. 5/-లు రుసుముగా ఉండేదన్నారు. ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.
ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం సహాయకార్యనిర్వహణాధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా పలువురు దేవస్థానం అధికారులకు, సిబ్బందికి కూడా ఉత్సవాల ప్రత్యేక విధులను కేటాయించడం జరిగిందన్నారు.
ఉత్సవ నిర్వహణకు గాను ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి , తహశీల్దార్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు, ఇతర రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారన్నారు.
అదేవిధంగా ఆత్మకూరు డి.ఎస్.పి ఆధ్వర్యములో రద్దీ క్రమబద్దీకరణ, వాహనాల క్రమబద్దీకరణ , భద్రతా చర్యలు వుంటాయన్నారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు మంచినీటి సదుపాయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. కొత్తపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి , సిబ్బంది పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
గోకవరం మండల ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యములో ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు వుంటుందన్నారు
దాత సహకారంతో దేవస్థానం భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు వుంటాయన్నారు . అన్నప్రసాద వితరణకు సంబంధించి దేవస్థానం దాతకు సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తోందన్నారు.
భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రణాళికబద్దంగా క్యూలైన్లను ఏర్పాటు వుంటుందన్నారు. భక్తులకు త్రాగునీరు అందించేందుకు కూడా ఆయా ఏర్పాట్లు వున్నాయన్నారు. వాహనాలరద్దీకనుగుణంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుద్ద్యం నిర్వహణకు కూడా తగు చర్యలు వుంటాయన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు వుంటుందన్నారు
కాగా వసంతపంచమి రోజున ఉదయం గం. 4.00లకు ఆలయద్వారాలు తెరచి ప్రాత:కాల పూజాదికాలు జరుగుతాయన్నారు. వేకువ జామున ఉదయం గం. 5.20లకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించబడుతాయన్నారు. ఉదయం గం. 6.00ల నుంచి భక్తులకు దర్శనాలు , సామూహిక అక్షరాభాస్యాలు వుంటాయన్నారు. మధ్యాహ్నం గం.11.15లకు అమ్మవారి మధ్యాహ్నకాలపూజలు వుంటాయన్నారు. తరువాత దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. సాయంకాలం గం. 6.00లకు ప్రదోషకాల పూజలు, నివేదన, మహా మంగళహారతుల అనంతరం రాత్రి గం. 7.00లకు ఆలయ ద్వారాలు మూసివేయబడుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొలనుభారతి క్షేత్ర పరిసరాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. భక్తుల ఈ విషయంపై దేవస్థానానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
