శ్రీశైల దేవస్థానం: సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు చెంచు భక్తులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులను ఆహ్వానించడం ప్రత్యేకం. స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఏ) అధికారుల సహకారంతో చెంచు భక్తులు కల్యాణోత్సవానికి విచ్చేసే ఏర్పాట్లు చేసారు.ఈ రోజు సాయంత్రం కల్యాణానికి విచ్చేసిన గిరిజన చెంచు భక్తులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, శ్రీమతి జి. గంగమ్మ, శ్రీ దేవకి వెంకటేశ్వర్లు, శ్రీమతి జి. శ్రీదేవి ప్రత్యేక ఆహ్వానితులు కె. నాగమల్లేశ్వరరావు, కె. సుధాకరరెడ్డి, సి. శ్రీనివాసులు ఆలయ మహాద్వారం వద్ద సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.
చెంచు భక్తుల వెంట ఐ.టి.డి.ఎ. అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసరు ఎ. సురేష్ కుమార్, పలువురు ఐ.టి.డి.ఎ. సిబ్బంది కూడా ఉన్నారు.
శ్రీశైలమహాక్షేత్రంలో గాఢమైన సంబంధం గల చెంచు భక్తుల సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కాగా చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురిగా శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అదే విధంగా స్వామివారిని చెంచు మల్లన్న, చెంచుమల్లయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
కల్యాణోత్సవానికి విచ్చేసిన చెంచు భక్తులకు దేవస్థానం తరుపున వస్త్రాలు ( పురుషులకు పంచ, కండువా, మహిళలకు చీర, రవిక వస్త్రం) లడ్డు ప్రసాదాలు కూడా అందించారు.
కాగా ఈ కల్యాణోత్సవంలో చెంచు గిరిజనులు నూతన వస్త్రాలతో పాటు వెదురుతో అల్లిన ఆభరణాలను, ఫలపుష్పాలను శ్రీస్వామిఅమ్మవార్లకు సంప్రదాయబద్దంగా సమర్పించారు.
కల్యాణ సమయములో చెంచు భక్తులు సమర్పించిన వెదురుతో అల్లిన అభరణాలను శ్రీస్వామిఅమ్మవార్లకు అలంకరింపజేసారు.
కాగా పలు చెంచుగూడాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర సంస్కతీలో చెంచులకు గల ప్రాధాన్యాన్ని వివరించారు. స్థానిక ఐ ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు ఆఫీసర్ కె.వి. శివప్రసాద్ , వారి సిబ్బంది కల్యాణోత్సవానికి గిరిజన చెంచు భక్తులను తోడ్కొని రావడంలో ఎంతగానో సహకరించారన్నారు. దేవస్థానం తరుపున ఐ.టి.డి.ఎ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
