






శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు 15న శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
ఉత్సవాలలో భాగంగానే యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణంకోసం జపాలు, పారాయణలు చేశారు.తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపారు.
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపారు.
నందివాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
తరువాత క్షేత్ర ప్రధాన వీధిల్లో గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవ కల్యాణం:
సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు రాత్రి శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం ప్రత్యేకం.
శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ , ప్రతిరోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించబడుతుండగా, మకర సంక్రాంతి రోజున మాత్రం శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల లీలాకల్యాణోత్సవం విశేషం.
ముగ్గులపోటీలు:
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించింది.
ఆలయ ముందు భాగంలో ఈ పోటీలు ఏర్పాటు చేసారు. మొత్తం 38 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు. స్థానికులే కాకుండా నంద్యాల, గుంటూరు, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీమతి జి. శ్రీదేవిలు పాల్గొన్నారు.
కార్యక్రమములో ఉపకార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, పర్యవేక్షకులు కె. గిరిజామణి, టి. హిమబిందు, పి. దేవిక, డి. స్వర్ణలత, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సంపాదకులు డా. సి. అనిల్‌కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
కాగా ఈ ముగ్గులపోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. అదేవిధంగా ఇరువురికి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు.
కాగా పోటీలో పాల్గొన మహిళలందరికీ శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, గాజులు, శ్రీఅమ్మవారి కుంకుమ, లడ్డు ప్రసాదాలు, దేవస్థానం క్యాలెండరు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీశైలమహా క్షేత్రంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో విశేషమన్నారు. లోకకల్యాణార్థం మకర సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు , మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా మన పండుగలలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మన భారతీయ సంప్రదాయంలో రంగువల్లులకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యంగా సంక్రాంతి ఆచరణలో ఈ రంగవల్లులకు మరింత ప్రాధాన్యత కల్పించబడిందన్నారు. మన పురాణాలలో పలుచోట్ల ఈ ముగ్గులు ప్రస్తావించబడ్డాయన్నారు. ముగ్గును శుభానికి, మంగళత్త్వానికి ప్రతీకగా భావిస్తారన్నారు. లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించే అంశాలలో ఇంటి ముంగిట రంగవల్లులను తీర్చిదిద్దడం కూడా ఒకటన్నారు. అందుకే ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం ప్రతీఏటా సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంక్రాంతిపర్వదినం రోజున ముగ్గుల పోటీలు నిర్వహిస్తోందన్నారు.
గత సంవత్సరం వరకు ఈ ముగ్గుల పోటీలను దక్షిణమాడ వీధిలో నిర్వహించడం జరుగుతుండేదని, అయితే మన సంప్రదాయం పట్ల భక్తులలో మరింతగా అవగాహన కల్పించాలనే భావనతో ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ఐ.ఎల్.ఎన్. చంద్రశేఖర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కడప జిల్లా వారు వ్యాఖ్యానాన్ని అందించారు.
