మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలి
ఖచ్చితమైన ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి
శ్రీశైలం / నంద్యాల, జనవరి 09 :-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డీఎఫ్‌వోలు విగ్నేష్ అపోవా, నీరజ్, భవిత కుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్, రేఖ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20 శాతం మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, రవాణా, క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలను 11 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగించేలా 24 గంటలు మూడు షిఫ్టులుగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డీపీఓను ఆదేశించారు.
లక్షలాది మంది పాదయాత్ర భక్తులు సుమారు 46 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, డస్ట్బిన్లు, టాయిలెట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 46 కిలోమీటర్ల పరిధిలోని కొలనులు, బావులు, అలాగే శ్రీశైల పరిధిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ని ఆదేశించారు. పాదయాత్ర మార్గమంతటా త్రాగునీరు, చలువ పందిళ్లు, టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో భక్తులు ఆరోగ్య ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నందున స్ట్రెచర్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని డీఎంఅండ్ హెచ్ఓను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం 7 అంబులెన్సులను సిద్ధంగా ఉంచడంతో పాటు, 10 ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. భీముని కొలనులో భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో మూడు షిఫ్టులలో నిరంతర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు 1800 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పటిష్టమైన ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, తిరిగి వెళ్లే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ శాఖ పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద మహాశివరాత్రి పర్వదినాల్లో ఎలాంటి రుసుం వసూలు చేయకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు, లింగాల గట్టు ప్రాంతంలో ప్రత్యేక అప్రమత్తతతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. భక్తుల భద్రతకు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రహదారి మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలు సులభతరం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న మలుపుల వద్ద అద్దాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్ రోడ్లలో భద్రత దృష్ట్యా అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించి వాహనాల నిర్వహణ చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ మిషన్లను వినియోగించాలని మలేరియా అధికారులను ఆదేశించారు. హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో కల్తీ జరగకుండా నమూనాలు సేకరించి తనిఖీలు నిర్వహించడంతో పాటు ధరల సూచిక బోర్డులు ప్రదర్శించేలా సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అదనపు జనరేటర్లు సమకూర్చాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో చోటుచేసుకున్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ, సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫారెస్ట్, పోలీస్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, శ్రీశైలంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు 7 ప్రదేశాల్లో హైడ్రాలిక్ క్రేన్లు, రికవరీ వ్యాన్లను అందుబాటులో ఉంచామన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు 27 ఎకరాల విస్తీర్ణంలో 5,450 వాహనాలు పార్కింగ్ చేయగల సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 36 లక్షల లడ్డు ప్రసాదాలను తయారు చేయడంతో పాటు, వాటి పంపిణీ కోసం 15 లడ్డు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
