శ్రీశైల దేవస్థానం:దేవస్థానం పరిధిలోని కొన్ని ప్రైవేటు సత్రాలలో వ్యక్తిగత కార్యక్రమాలు అనగా పుట్టినరోజు వేడుకలు, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు, విందులు, వినోదాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చింది.
అనాదిక్షేత్రమైన శ్రీశైలం గొప్ప అధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రంలో భక్తి, ఆధ్యాత్మిక సంబంధితమైన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించవలసివుంది.ఈ కారణంగా సత్రాలలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, పారాయణలు, భజనలు, సత్సంగాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా వైదిక పరమైన కార్యక్రమాలు జరిపించుకొనవచ్చును.
ఇందుకు భిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భక్తుల మనోభావాలకు విఘాతం కలిగే అవకాశం ఎంతైనా వుంది.
సత్రాలు వారు భక్తులలో మరింతగా భక్తిభావాలను పెంపొందింపజేసేందుకు, వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
దేవదాయచట్టం 30 / 1987 అనుసరించి దేవస్థానం పరిధిలో క్షేత్ర పరిధికి భంగం కలిగించే ఏ విధమైన కార్యక్రమాలు కూడా పూర్తిగా నిషిద్ధం.
అన్ని సత్రాల వారు , ఇతర సంస్థల వారు కూడా వారి వారి సత్రాల లో ఇటువంటి నిషేధిత కార్యక్రమాలు అనుమతించకూడదని దేవస్థానం స్పస్టం చేసింది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం తగు చర్యలు వుంటాయని దేవస్థానం వారు హెచ్చరించారు.
