







శ్రీశైల దేవస్థానం:
• సంప్రదాయబద్దంగా వార్షిక ఆరుద్రోత్సవం
• నిన్న రాత్రి శ్రీస్వామివార్లకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
• ఈ రోజు వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఉత్తర ద్వార దర్శనం,
• ఉత్సవంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, గ్రామోత్సవం
ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు.
ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించారు.
ఈ రోజు తెల్లవారుజామున శ్రీ స్వామివార్ల ప్రాత:కాల పూజల అనంతరం ఉత్సవంలో భాగంగానే నందివాహన సేవ, స్వామివార్ల ఉరేగింపు జరిపించారు.
కాగా ఈ ఉత్సవంలో భాగంగా నిన్న రాత్రి గం.10.00లకు, ఉత్సవం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిపూజ జరిపించారు. తరువాత లోక కల్యాణం కోసం ఈ ఉత్సవ సంకల్పంలో, దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికి సుఖసంతోషాలు కలగాలని, సంకల్పం చేసారు.. అనంతరం మహన్యాసాన్ని జరిపి శ్రీ స్వామివారికి లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు . పంచామృతాలతోనూ, పలు ఫలరసాలతోనూ, ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండ పుణ్యజలంతోనూ ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తరువాత స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. అనంతరం పలు రకాల పుష్పాలతో, బిల్వదళాలతో స్వామివారికి విశేషపూజలు జరిపారు.
ఈ రోజు వేకువ జామున గం.3.00లకు మంగళవాయిద్యాల అనంతరం గం. 3.30 ని!!లకు సుప్రభాతసేవ, నిర్వహించారు. తరువాత శ్రీ స్వామివార్లకు ప్రాత:కాలపూజలను జరిపించిన అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం కల్పించారు.
అనంతరం నందివాహన సేవ జరిగింది. తరువాత గ్రామోత్సవం జరిపారు.
కాగా ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళే స్వామిఅమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తర ద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున , శివముక్కోటి రోజున (వార్షిక ఆరుద్రోత్సవం రోజున) ఈ విధంగా శ్రీస్వామిఅమ్మవార్లు ఆలయ ఉత్తర ద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్తారు.
గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవ మూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.
శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
స్వర్ణరథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు:
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణరథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా కార్యక్రమములో పలు కళా బృందాల కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం మొదలైన కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.
