




శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నూతనంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శనివారం ప్రారంభించారు.
మల్లికార్జునసదన్లోని హాల్ లో ఈ ఆధ్యాత్మిక గ్రంథాలయం ఏర్పాటు అయింది.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఈ ఆధ్యాత్మిక గ్రంథాలయం ఏర్పాటు అయిందన్నారు. గ్రంథాలయంలో పురాణాలు, ఇతిహాసాలు, భక్తి సాహిత్యం మొదలైన గ్రంథాలను భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం గంగాధర మండపం వద్ద తిరుపతి సత్రం పాత భవనాన్ని తొలగించి ఆ ప్రదేశంలో ఆధ్యాత్మిక గ్రంథాలయం, మ్యూజియం, గదులను నిర్మించనున్నట్లు తెలియజేశారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తులలో భక్తిభావాలను మరింతగా పెంపొందించి వారిలో ఆధ్యాత్మిక చింతను కలిగించేందుకు ఈ గ్రంథాలయం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. దశలవారిగా గ్రంథాలయాన్ని విస్తరించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి సుమారు 1000కి పైగా గ్రంథాలను పొంది పాఠకులకు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా సుమారు 1400లకు పైగా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. దాదాపుగా 2,400 పైగా ఆధ్యాత్మిక పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. పలువురు ఆధ్యాత్మిక రచయితలు , ఇతర సంస్థల నుంచి మరిన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను పొందేందుకు చర్యలను తీసుకుంటున్నామన్నారు.
ఈ గ్రంథాలయంలో దిన పత్రికలను, పలు ఆధ్యాత్మిక మాస పత్రికలను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు.
స్థానికులు, భక్తులు ఈ గ్రంథాలయ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు , కార్యనిర్వహణాధికారి కోరారు.
శ్రీశైల క్షేత్రంపై దేవస్థానం ఇటీవల ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్కును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ధర్మకర్తల మండలి వారికి అందజేశారు.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, శ్రీమతి బి. రవణమ్మ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శ్రీమతి జి. లక్ష్మీశ్వరి, శ్రీమతి జి.గంగమ్మ, శంకరశెట్టి పిచ్చయ్య, శ్రీమతి జె. రేఖాగౌడ్, ఎ. అనిల్‌కుమార్, బి. వెంకటసుబ్బారావు, చిలువేరు కాశీనాథ్, మేడ మురళీధర్, శ్రీమతి జిల్లెల శ్రీదేవి పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు కె. నాగమల్లేశ్వరరావు, బి. చంద్రమౌళీశ్వరరెడ్డి, కట్టా సుధాకరరెడ్డి, వి. వెంకటేశ్వర్లు, ఎ. శ్రీనివాసులు పాల్గొన్నారు.
