శ్రీశైలం / నంద్యాల జిల్లా : 20-12-2025
శనివారం తెల్లవారుజామున శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద వేద పండితులు భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణ మార్గం ద్వారా ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు.
మొదటగా ధ్వజస్తంభానికి నమస్కరించి శివ సంకల్పం చేశారు. అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి మహా మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం పంచామృతాలతో శత రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లికా పుష్పాలతో మహా మంగళహారతి నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి, అర్చకుల చేత స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం వృద్ధ మల్లికార్జున స్వామి లఘుభిషేకం, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ త్రిశూల దర్శనం చేసుకున్నారు. తదుపరి కుమారస్వామిని దర్శించుకున్నారు.
తదుపరి భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారి దంపతులు శ్రీ భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజలను ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు.
తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాలు శేష వస్త్రాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస రావు భారత ఎన్నికల కమిషనర్ కు సమర్పించారు.
అనంతరం గోకులంలో గోమాత పూజను సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ , జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా , జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ , జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్ , ఆలయ ఈఓ శ్రీనివాస రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
