శ్రీశైల దేవస్థానం:ఆంధ్రప్రదేశ్ దేవదాయ, ధర్మదాయశాఖ చట్టం 1987 ప్రకారము శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రార్థనలు చేయటం, ప్రచారాలు నిర్వహించటం, అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలను, పుస్తకాలను పంచటం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం, అన్యమత చిహ్నాలను ధరించటం లేదా ప్రదర్శించడం మొదలైనవి పూర్తిగా నిషేధించారు.
అదేవిధంగా క్షేత్రపరిధి అంతటా కూడా అనగా, ఆలయ పరిసర ప్రాంతాలు, మాడవీధులు, ఉపాలయాలు, అనుబంధ ఆలయాలు, పంచమఠాలు, వసతిగృహ సముదాయాలు, వాణిజ్య భవన సముదాయాలు, పాతాళగంగ పరిసర ప్రాంతాలు, బాహ్యవలయ రహదారులందు, శిఖరేశ్వరం, హాటకేశ్వరం, పంచదార, సాక్షిగణపతి మొదలైన ప్రాంతాలలో దేవస్థాన అధికారులు ముందస్తు అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత రీల్స్ ను ప్రచారం చేయడం నిషేధించారు.
క్షేత్ర పరిధిలో ధూమపానము, మద్యపానము సేవించుట, జూదము ఆడుట, మాంసాహారాలు సేవించుట మొదలగు అసాంఘిక కార్యకలాపాలు కూడా చట్ట రీత్యా నేరమే.పై నిబంధనలను ఉల్లంఘించి, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు వుంటాయని దేవస్థానం పేర్కొంది. భక్తులు ఈ విషయాలు గమనించి దేవస్థానము వారికి సహకరించాలని అధికార ప్రకటనలో కోరారు.
