శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసంలో నాల్గవ సోమవారమైన సోమవారం భక్తులు వేకువజాము నుండే అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని శ్రీస్వామిఅమ్మ వార్ల దర్శనార్థమై ఆలయానికి చేరుకుంటున్నారు. 




దర్శనం ఏర్పాట్లు :
కార్తీక మాసంలో ప్రభుత్వసెలవుదినాలు, కార్తీక సోమవారాలు , కార్తీక పౌర్ణమి రోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేశారు.
వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాత:కాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున గం.4.30ల నుంచి సాయంత్రం గం.4.00ల వరకు దర్శనాలను కొనసాగించడం జరుగుతోంది. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి దర్శనాలు కొనసాగుతాయి. అదేవిధంగా కార్తీకమాస రద్దీరోజులలో శని,ఆది,సోమవారాలు శుద్ధఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు ( కార్తీక మాసములో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు.అదేవిధంగా ఈ రద్దీ రోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలుపుదల చేశారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు;
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
క్యూలైన్లలో అల్పాహారం:
కార్తీక మాసమంతా క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు ఉదయం నుంచే వేడిపాలను కూడా అందించారు. అలాగే భక్తులకు అల్పాహారంగా పులిహోర, పెరుగన్నం కట్టుపొంగలి, మంచినీరు , బిస్కెట్లు అందించారు.
కార్తీక దీపోత్సవం:
భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి , గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అన్నప్రసాద వితరణ:
భక్తులకు అన్నప్రసాద వితరణ భవనములో ఉదయం 10.30 నుండి ప్రసాదాల వితరణ చేస్తున్నారు. సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు వుంది.
లడ్డు ప్రసాదాలు
కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు . మొత్తం 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందిస్తున్నారు.
