











కార్తీక వనభోజనాలు:
కార్తీకమాసోత్సవాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ రోజు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ( కార్తీక వనభోజనాలు) నిర్వహించింది.
ఆలయ ఈశాన్యభాగంలోని రుద్రవనంలో (రుద్రాపార్కులో) ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ వనసమారాధనలో (వనభోజనాలలో) శ్రీశైలదేవస్థానం అన్ని విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
అదేవిధంగా పలుస్థానిక ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
కార్యక్రమములో ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రుద్ర వనములోని ఉసిరిచెట్టుకు సంప్రదాయబద్దంగా పూజాదికాలు జరిపించారు.
ఈ కార్యక్రమములో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు , పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వైదికసంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా , ఆలయ సంప్రదాయాలపై అందరికి అవగాహన కల్పించాలనే భావనతో ఈ వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సంప్రదాయబద్దంగా వనభోజనాలు చేయడం వలన విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడం వల్ల మరింత ఫలితం లభిస్తుందన్నారు.
శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్పతీర్థంగా కూడా మన పురాణాలు పేర్కొన్నాయన్నారు. ఈ క్షేత్రం ఎన్నో తీర్థాలకు నిలయమన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి అనాది క్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు. యుగయుగాలుగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భూ మండలానికి నాభిస్థానంగా ఈ క్షేత్రం పేర్కొనబడిందని, అందుకే మనం ఆచరించే వైదిక కార్యక్రమాలు, పూజాదికార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పడం జరుగుతుందన్నారు.
*వి. పెద్ద సుబ్బారెడ్డి, పోరుమామిళ్ళ, కడప జిల్లా ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, పర్యవేక్షకులు పి. దేవికకు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు
