
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శనివారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.
అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు. అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరిగాయి.
కుమారీ పూజ:
దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
కాత్యాయని అలంకారం:
నవరాత్రి మహోత్సవాలలో , నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు।
నవదుర్గలలో ఆరవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయ హస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాత్యాయనిదేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చునని చెప్పబడింది. ఇంకా శ్రీ కృష్ణుని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారినే పూజించారట.
కాత్యాయని ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా హరింపబడుతాయంటారు.
హంసవాహనసేవ:
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు హంసవాహనసేవ జరిపారు.
ఈ వాహన సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, హంస వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు
పుష్పపల్లకీ సేవ:
దసరా మహోత్సవాలలో భాగంగా రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ జరిపారు.
ఈ సేవలో వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్ప మేళతాళాలతో శ్రీ స్వామిఅమ్మవార్లను తొడ్కొని వచ్చి పుష్పపల్లకిలో ఊరేగింపు చేశారు.
కాగా ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, అశోక పత్రాల మాల, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.