
శ్రీశైల దేవస్థానం: *శ్రీశైలం దసరా మహోత్సవాల ఏర్పాట్లకు సన్నాహక సమావేశం
*సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2 వరకు దసరా మహోత్సవాలు
- ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు వాహనసేవలు
- అమ్మవారికి నవదుర్గా అలంకరణలు, విజయదశమిరోజున శమీపూజ, ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు
****సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబరు 2 తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ మహోత్సవ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లను గురించి చర్చించేందుకు శనివారం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, వేదపండితులు, డిప్యుటీ కార్యనిర్వహణాధికారిణి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశములో ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, నిజరూపాలంకరణ, రాజరాజేశ్వరి అలంకరణ, విజయదశమిరోజున శమీపూజ, తెప్పోత్సవం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, దర్శనం ఏర్పాట్లు, భక్తులకు అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాలను కూలంకుషంగా చర్చించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టడంలో అన్ని విభాగాలు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
ఉత్సవ రోజులలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. అదేవిధంగా వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కూడా ఆదేశించారు.
ఉత్సవాల నిర్వహణలో భాగంగా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని పరిపాలనావిభాగాన్ని ఆదేశించారు.
భక్తులు ఆయా ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా తగిన విధంగా విద్యుద్దీపాలంకరణ చేయాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు.
అలాగే సంప్రదాయపద్ధతిలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
రద్దీరోజులలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా , వాహనాల పార్కింగు సంబంధించి తగు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని భద్రతావిభాగాన్ని ఆదేశించారు. ఈ విషయములో స్థానిక పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలను పొందాలని కూడా సూచించారు.
ఉత్సవాలలో భక్తులు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని చెబుతూ, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజా శౌచాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
భక్తులరద్దీకనుగుణంగా మధ్యాహ్నవేళలో అన్నప్రసాదాల వితరణకు (అన్నదానానికి), రాత్రివేళలో అల్పాహారానికి తగు ఏర్పాట్లు చేయాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా క్యూకాంప్లెక్స్‌లో దర్శనాలకు వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాలను అందజేస్తుండాలని అన్నప్రసాద వితరణ, క్యూకాంప్లెక్స్ విభాగాలను ఆదేశించారు.
ఉత్సవాలలో ఆయా ఉత్సవాల విశేషాలు భక్తులకు తెలిసేవిధంగా ఆయా ప్రదేశాలలో తగినన్ని సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ , శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ప్రసార మాధ్యమాలలో తగు ప్రచారాన్ని కూడా కల్పించాలన్నారు.
ఉత్సవాల విశేషాలను భక్తులకు తెలిసేవిధంగా ముందుగానే తగు ప్రచారం కల్పించాలన్నారు.
సామాజిక మాధ్యమాలలో కూడా ఉత్సవాల సంబంధి విశేషాలను భక్తులకు తెలియజేస్తుండాలని ప్రచారవిభాగాన్ని ఆదేశించారు.
ఉత్సవాల సమయంలో నిత్యకళావేదికపై ప్రవచనాలు, హరికథ, వాయిద్య సంగీతం, సంప్రదాయ నృత్యం, మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు. అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో నాదస్వరంతోపాటు కోలాటం, చెక్కభజన, నందికోలుసేవ, డోలువాయిద్యాలు మొదలైన జానపద కళారూపాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.