
శ్రీశైల దేవస్థానం:కార్యనిర్వహణాధికారి అన్నిశాఖాధిపతులు, విభాగాల పర్యవేక్షకులతో సోమవారం ప్రత్యేకంగా . సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవలసిన ఆయా చర్యలపై చర్చించేందుకు జరిపిన ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారివారు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రసాదాలను భక్తులు ఎంతో పవిత్ర భావంతో స్వీకరిస్తారని, ప్రసాదాల తయారీని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. ముఖ్యంగా ప్రతీరోజు ఉండే ఆయా ప్రసాదాలన్నీ కూడా రుచికరంగా ఉండేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.అదేవిధంగా దేవస్థానం కొనుగోలు చేసే సరుకులన్నీ నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు.
అన్నప్రసాదాలలోని వంటకాలన్నీ కూడా రుచికరంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వంటకాలలో వాడే కూరగాయలన్నీ కూడా తాజాగా ఉండాలన్నారు. అన్నప్రసాదవితరణ కూడా నిర్ధిష్టమైన పద్ధతిలో ఉండాలన్నారు. ముఖ్యంగా వండిన ప్రతి వంటకం ప్రసాదాలు స్వీకరించే ప్రతి భక్తుడికి అందేవిధంగా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అన్నప్రసాదవితరణలో సమయపాలన పాటించడం కూడా తప్పనిసరి అన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంత్రం వేళలో అల్పాహారాన్ని ఎటువంటి కాలతీతంకాకుండా భక్తులకు అందిస్తుండాలన్నారు. అన్నప్రసాదవితరణ సమయంలో ప్రతి హాలును కూడా సిబ్బంది ఒకరు పర్యవేక్షిస్తుండాలన్నారు.
అదేవిధంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించేవిధంగా సంబంధిత పర్యవేక్షక సిబ్బంది చర్యలు చేపడుతుండాలన్నారు. ఆయా ప్రదేశాలలో ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన వీధులు, ప్రధానకూడళ్ళు, దేవస్థాన సత్రాలు, కాటేజీలు మొదలైనచోట్ల పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు జరుగుతుండాలన్నారు.
క్షేత్రపరిధిలోనూ, క్యూకాంప్లెక్సులో గల అన్ని శౌచాలయాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అన్ని శౌచాలయాలకు కూడా నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.
క్షేత్రసుందరీకరణలో భాగంగా అవకాశం ఉన్నచోట్ల ల్యాండ్‌స్కేపింగ్ గార్డెనింగ్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, అన్నిశాఖల సహాయ కార్యనిర్వహణాధికారులు, విభాగాల పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.