
శ్రీశైల దేవస్థానం:ఆదివారం సాయంకాలం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలుచోట్ల విస్తృతంగా పరిశీలించారు. యాంఫీథియేటర్, గణేశసదనం, హాటకేశ్వరం వద్ద గల యాత్రికుల సదుపాయ కేంద్రం, శిఖరేశ్వరం వద్ద యాత్రికుల సదుపాయ కేంద్రం, శిఖరేశ్వరాలయం , సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయాన్ని
పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండే శ్రావణమాసం, కార్తికమాసం మొదలైన సమయాలలో భక్తులను అలరించేందుకు యాంఫీ థియేటర్ వద్ద ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు.
తరువాత గణేశసదన్లోని కౌంటర్లను, గదులను పరిశీలించారు. గదుల శుచీ శుభ్రతపట్ల నిరంతరం పర్యవేక్షణ ఉండాలని వసతివిభాగం అధికారులను ఆదేశించారు.
అనంతరం హాటకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాల వద్ద గల యాత్రికుల సదుపాయ కేంద్రాలను పరిశీలించారు. వీలైనంత త్వరలో వీటిని యాత్రికులకు అందుబాటులోకి తేవాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించారు.
ప్రధాన రహదారి నుంచి శిఖరేశ్వరం వరకు గల సీసీ రోడ్డుకు ఇరువైపులా మరిన్ని మొక్కలను నాటాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. సుందరీకరణ పనులలో భాగంగా శిఖరేశ్వర ఆలయ పరిసరాలలో అనువైనచోట్ల పచ్చికబయలు ( ల్యాండ్ స్కేపింగ్) ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ – ఉద్యాన వన విభాగాన్ని ఆదేశించారు.
శిఖరేశ్వర ఆలయ మెట్లమార్గంలో అవసరమైనచోట్ల మరమ్మతులు చేయాలన్నారు. శిఖరేశ్వర ఆలయం వద్ద గల పుష్కరిణిలోని పూడిక తీస్తూ ఎప్పటికప్పుడు పుష్కరిణి పరిశుభ్రతంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా ఆలయ ప్రాంగణం పరిసరాలన్ని పరిశుభ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగిస్తుండాలన్నారు.
తరువాత సి.ఆర్.ఓ కార్యాలయన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న వసతి సదుపాయాలను సమీక్షించారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని కేంద్రవిచారణ కార్యాలయ సిబ్బంది అందిస్తుండాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా గదులు, కాటేజీలు ఖాళీ అయిన వెంటనే శుభ్రపరుస్తుండాలని సూచించారు.
ముఖ్యంగా సిబ్బంది భక్తులందరితో మర్యాదపూర్వకంగా మెలుగుతుండాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, ఇంఛార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు చంద్రశేఖరశాస్త్రి, వసతి విభాగం పర్యవేక్షకులు బి. శ్రీనివాసులు, రెవెన్యూ విభాగం పర్యవేక్షకులు ఎం. శ్రీనివాసరావు, సంబంధిత సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.