
శ్రీశైల దేవస్థానం:గతంలో మాదిరిగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శదర్శనం ఏర్పాటు చేశారు. ఉచిత స్పర్శదర్శనం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. భక్తుల సౌకర్యార్థం మంగళవారం నుంచి శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం పున: ప్రారంభమైంది.గతంలో వలనే వారంలో నాలుగురోజులపాటు మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో ఈ ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. ఈ రోజులలో 2 గంటల పాటు మధ్యాహ్నం గం. 1.45 ల నుంచి 3.45ల వరకు ఈ ఉచిత స్పర్శదర్శనం ఏర్పాటు వుంటుంది. స్పర్శదర్శనం పొందే భక్తులు మధ్యాహ్నం గం. 1.15లకు ఉచిత దర్శన క్యూలైన్ వద్దకు చేరుకోవలసి వుంటుంది.
ఈ రోజు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు స్పర్శదర్శన సమయంలో ఆయా క్యూలైన్లను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. ఉచిత స్పర్శదర్శనం పట్ల భక్తులందరు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం కల్పించిన ఈ సదుపాయం వల్ల తాము ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగానే శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని చేసుకునే అవకాశం లభించిందన్నారు.
కాగా ఉచిత స్పర్శదర్శనం పునః ప్రారంభాన్ని గురించి కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత కల్పించేందుకు స్పర్శదర్శనాన్ని పున: ప్రారంభించడం జరిగిందన్నారు. భక్తులు మల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం చేసుకోవడం వలన ఎంతో ఆధ్యాత్మాకానుభూతిని పొందుతారన్నారు.
ఆలయ సంప్రదాయాను అనుసరించి ఉచిత స్పర్శదర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో రావాల్సి ఉంటుందన్నారు ఈ ఓ. అదేవిధంగా పురుషులు తెల్లపంచ , మెడలో తెల్లకండువాను ధరించాలన్నారు. మహిళలు చీర , రవికను లేదా చున్నితో కూడిన సల్వారు కమీజ్లను ధరించవలసివుంటుందన్నారు.
ఉచిత స్పర్శదర్శన పున: ప్రారంభం సందర్భంగా కార్యనిర్వహణాధికారి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను అన్ని క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. క్యూలైన్లో ఎలాంటి తోపులాటలు లేకుండా భద్రతా సిబ్బంది తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. క్యూలైన్ నిర్వహణలో ఆలయ , క్యూకాంప్లెక్సు విభాగాలు పరస్పర సమన్వయంతో ఆయా చర్యలు చేపట్టాలన్నారు.
గతంలో వలనే వారాంతపు రోజులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు, దసరా మహోత్సవాలు, శ్రావణమాసం, కార్తీకమాసం , ప్రభుత్వ సెలవురోజులలో ఈ ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం ఉండదు. ఉచిత స్పర్శ దర్శన నిలుపుదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు ముందస్తుగా తెలుపుతామన్నారు.
అదేవిధంగా గతంలో ఉన్నట్లుగానే ఎప్పుడైనా ఊహించని విధంగా భక్తులు ఆలయానికి విచ్చేసిన సందర్భంలో కూడా ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తారు