
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం ఉచిత యోగ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిబ్బంది, స్థానికులు, యాత్రికుల సౌకర్యార్థం ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజులపాటు , ప్రతీ మంగళ, బుధవారాలలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
చంద్రవతి కల్యాణ మండపంలో ఉదయం గం. 7.00ల నుంచి గం. 8.30ల వరకు ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది.
మనరాష్ట్రంతో పాటు తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో యోగా శిక్షణను ఇచ్చిన ప్రముఖ యోగా గురువు యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు ఈ శిక్షణను ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది, స్థానికులు , యాత్రికులకు యోగాపై అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత యోగ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. యోగసాధన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మంచిఫలితాన్నిస్తుందన్నారు. ముఖ్యంగా యోగా అనేది మనస్సుతో పాటు శరీరానికి కూడా సంబంధించిందన్నారు. మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మన పూర్వీకులు యోగాను పేర్కొన్నారన్నారు. ఈ ఆధ్యాత్మిక గమనంలో ఆరోగ్యం, ఆనందం, ఆయువు ఉపఉత్పత్తులుగా లభిస్తాయన్నారు. అందుకే అందరు కూడా ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిళ్ళు లేకుండా ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపేందుకే యోగా శిక్షణు ప్రారంభించామన్నారు. అందరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని యోగసాధనను చేయాలన్నారు.
కాగా అనే యోగాకార్యక్రమాలు నిర్వహించిన యోగాచార్యులు గంధవళ్ళ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలోని ప్రధాన క్రియలు అని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవితం, సుఖసంతోషాలు, బాధల నుంచి విముక్తి, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ కూడా యోగా ద్వారా పొందవచ్చునన్నారు.
ఈనాటి శిక్షణా కార్యక్రమములో యోగాగురువు ఆయా అంశాలను వివరిస్తూ సూక్ష్మ వ్యాయామాన్ని చేయించారు. తరువాత ప్రాణాయామాన్ని, ధ్యానాన్ని చేయించారు. రేపటి (2 న ) కార్యక్రమములో యోగాచార్యులు శిక్షకులు పలు యోగాసనాలను సాధకుల చేత చేయిస్తారు.
ఈనాటి శిక్షణ కార్యక్రమానికి 200 మంది హాజరయ్యారు.