శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణంకోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి మంగళవారం సంప్రదాయబద్ధంగా కుంభోత్సవం జరిపారు.
ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏ వారం ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
ఈ ఉదయం జరిగిన కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేదపండితులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్. రమణమ్మ, అధికారులు ఎం. హరిదాసు, పర్యవేక్షకులు, కె. అయ్యన్న, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
మొత్తం మీద ఈ ఉత్సవంలో దాదాపు అయిదు వేలకు పైగా గుమ్మడికాయలు, అయిదు వేలకు పైగా కొబ్బరికాయలు, సుమారు 60వేలకు పైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం) అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు.
ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు. ఈ పసుపు, కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఇక స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
కాగా కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, పారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపారు.
తరువాత అమ్మవారి ఆలయంలో రజకునిచేత ప్రత్యేక ముగ్గు వేయించి శ్రీ చక్రం వద్ద విశేషపూజలు చేసారు. దీనికే రజకరంగవల్లి అని పేరు.
తరువాత సాత్త్వికబలికి సిద్ధం చేసిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజాదికాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
ఈ మొదటి విడత సాత్విక బలి సమర్పణకు తరువాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద మహిషాసురమర్దని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్విక బలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
కాగా ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిగింది.
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాసిగా వేసారు.
చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండివంటలతో అమ్మవారికి మహానివేదన ప్రత్యేకం.
కాగా ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఈ ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు
*పట్టువస్త్రాలు గాజుల సమర్పణ:
కుంభోత్సవాన్ని పురస్కరించుకుని 14రాత్రి తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, జంగాలపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ నైనారు పొన్నారావు, నైనారు బాలాజీ రావు, డాక్టర్ నైనారు పృథ్వి ,వారి కుటుంబ సభ్యుల శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు , అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమలను సమర్పించారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు వీరయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు..