శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఈ నెల 15న ( మంగళవారం రోజున) కుంభోత్సవం జరుగనున్నది.
ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం పౌర్ణమి తరువాత మంగళవారం వస్తోంది.ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు.
ప్రాత:కాలపూజలు :
ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత:కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరుగుతాయి.
కొబ్బరికాయలు – గుమ్మడికాయల సమర్పణ :
ఈ పూజాదికాల తరువాత శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు మొదటి విడత సాత్వికబలిగా సమర్పిస్తారు.
కోటమ్మవారి పూజలు :
ఈ సందర్భంగానే హరిహరరాయగోపురద్వారం వద్ద గల మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేకపూజాదికాలను జరిపించి సాత్యికబలిగానే కొబ్బరికాయలను సమర్పిస్తారు.
శ్రీ స్వామివారికి అన్నాభిషేకం :
ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం వుంటుంది. అనంతరం శ్రీస్వామివారి ఆలయద్వారాలు మూసివేయబడుతాయి.
కుంభహారతి :
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షిణ మండపములో అన్నాన్ని కుంభరాశిగా పోస్తారు. అదేవిధంగా సింహ మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీవేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది.
ఈ కుంభహారతి సమయములోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు, కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఈ సందర్భముగా కూడా రెండవ విడత సాత్వికబలిగా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు.
కుంభహారతి సమర్పణ తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు .
మహానివేదన :
ఈ ఉత్సవం సందర్భంగా అమ్మవారికి పరకాల వంటకాలతో సమర్పణ వుంటుంది
జంతుబలి నిషేధం :
దేవాదాయ చట్టముననుసరించి క్షేత్ర పరిధిలో జంతు , పక్షి బలులు పూర్తిగా నిషేధించారు.నిషేధం కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
ఈ చట్టం ప్రకారం జంతు బలులు నిర్వహించడమే కాకుండా జంతు బలులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించడం కూడా నేరం.
జంతు/పక్షి బలి నిషేధాన్ని గురించి భక్తులలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) జంతుబలి నిషేధాన్ని గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు.. క్షేత్రపరిధిలో జంతుబలి నిషేధం గురించి అవగాహన కల్పించేందుకు పలుచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
జంతు / పక్షి బలుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు దేవస్థాన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
ఆలయమాడవీధులు, అంకాళమ్మ ఆలయం, బయలు వీరభద్రస్వామి ఆలయం, క్షేత్రపరిధిలోని మహిషాసురమర్థిని అమ్మవారు, సుంకులమ్మ అమ్మవారు, అమ్మవారి విగ్రహాలు నెలకొల్పబడిన ప్రదేశాలు మొదలైనచోట్ల సిబ్బంది ప్రత్యేక విధులను నిర్వహిస్తారు.
స్థానిక రెవిన్యూ మరియు పోలీస్ శాఖల సహకారముతో జంతు / పక్షి బలుల నిషేధానికి అవసరమైన అన్ని చర్యలువుంటాయి.
అదే విధంగా ఉత్సవ నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
కుంభోత్సవం రోజున కల్యాణోత్సవం నిలుపుదల:
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటి వలనే కుంభోత్సవం రోజున శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంత సేవ నిలుపుదల చేస్తారు.
అదేవిధంగా కుంభోత్సవం రోజున అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు కూడా నిలుపుదల చేస్తారు