మరో అన్నమయ్య అన్నామయ్యా..!
(శ్రీనివాసుని సన్నిధి నుంచి
శ్రీహరి సన్నిధికి చేరిన బాలకృష్ణ ప్రసాద్ గరిమళ్ళకు
ప్రణామాలు అర్పిస్తూ ..)
వినరో భాగ్యము విష్ణుకధ..
అంతే భాగ్యము
గరిమెళ్ళ బాలకృష్ణది కదా..
శ్రీహరి నందకము
అన్నమయ్యగా
అవతరిస్తే..
ఆ అన్నమయ్య కీర్తనలు
ఆరు వందలు గానం చేసి
తరించలేదా గరిమెళ్ళ..
మెచ్చలేదా జగమెల్ల..!
ఆయన గొంతులో
అదోలాంటి మార్ధవం..
అన్నమయ్య కీర్తనకు
సరిపోయే రవం..
అందుకోసమే పుట్టాడేమో
ఈ ప్రసాదు..
సంగీత సరస్వతి వరప్రసాదమై..
వెంకయ్య సన్నిధే
తన కీర్తనల కీర్తి ప్రాసాదమై..!
పుడుతూనే ఆలపించాడా..
ఆలపించడం కోసమే పుట్టాడా
ఏదేమైనా పెట్టిపుట్టాడీ బాలకృష్ణ…
ఎప్పటికీ తీరని సంగీత తృష్ణ..!
పాడావు..పొగిడావు..
రాసావు..వాసికెక్కావు..
ఏం చేసినా
అన్నమయ్యే ఆలంబన..
ఆ వాగ్గేయకారుని స్తుతి
నీ వాంగ్మయమై..
ఆరొందల కీర్తనలు
నీ వాంగ్మూలమై..
అన్నమయ్య పాటలు
నీ బాటలై..
ఇదిగో ..ఈ రోజున
నీ పరమపదానికి
దారులై..
రాగ ధారలై..
ఏడుకొండలు
నీ స్వర విన్యాసాలకు
ఆవాసాలై..
శ్రీనివాస మందిరాల్లో
సదా నీ కీర్తనలు
మందారాలై..
నిలిచే భాగ్యము
నీ సౌభాగ్యమై..!
తాళ్ళపాక అన్నమయ్య
కీర్తనలేమో వేనవేలు..
మరి నువ్వు పాడినవి
ఆరొందలు ..
శేషం విశేషంగా పూర్తిచేసి
మరింతగా అలరిస్తావనుకుంటే
పాటల పల్లకిపై
స్వర్గపురికి ఈ ఆకస్మిక
ప్రయాణమేంటయ్యా..
సాక్షాత్తు శ్రీహరి సన్నిధిలో
ఉన్నదేమో
సశేష కీర్తనల పారాయణ..
నారాయణా నీ నామమే గతియిక..
ఆలాపనా పరంపర
నాకు కొనసాగుటకు..
పైపై ముందట భావజలధి..
శ్రీనివాసుని నిజ ఆస్థానములో
కొనసాగదా నీ రాగ జలధి.
పాడుతూ వెళ్లినా..
స్వామిని పొగుడుతూ
ఉండడమేగా నీ పరమావధి..!
సురేష్..9948546286 ( సాహిత్య లోకం,whatsapp group)