స్టార్టప్ ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్ కు చెందిన గోయాస్ హబ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం హెచ్ఐసీసీలో గో యాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం టీ హబ్ పౌండేషన్ సీఈవో సుజిత్, బ్రెజిల్లోని గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్‌లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి.
మార్కెట్ యాక్సెస్ తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై రెండు సంస్థలు కలిసి పని చేస్తాయి. మన దేశంతో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుంది.