సంక్రాంతి బ్రహ్మోత్సవాలు విజయవంతం-ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా సమర్థవంతంగా నిర్వహించుకుందాం-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని ఈ ఓ  సూచించారు  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి.11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం  కార్యనిర్వహణాధికారివారు  ఎం. శ్రీనివాసరావు దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు,  వైదికకమిటీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

 సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో వైదిక కమిటీ, అర్చకస్వాములు, వేదపండితులు, శాఖాధిపతులు, విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది అందరు కూడా ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు. ఉద్యోగులందరి సహాయ సహకారాల వలనే బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయన్నారు.

తరువాత విభాగాల వారిగా మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధవహించాలన్నారు.

ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు.

అన్ని విభాగాల వారు ఇప్పటికే రూపొందించబడిన ప్రణాళికలను (యాక్షన్హాన్) అనుసరించి ఆయా ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తుగానే భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అందుకే శివరాత్రి పనులను మరింత వేగవంతంగా చేయాలన్నారు. అదేవిధంగా పనులలో పూర్తి నాణ్యత ఉండాలన్నారు.

ముఖ్యంగా అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.

వైదిక సిబ్బంది , ఆలయ విభాగాధికారులు పరస్పర సమన్వయంతో ఉత్సవాలలో జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆలయవిభాగానికి సూచించారు.

ఉత్సవాల లో  ఆయా కైంకర్యాలలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు.

అదేవిధంగా మహాశివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం, తెప్పోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.

అనంతరం పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అదేవిధంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లన్ని కూడా ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు.

క్యూకాంప్లెక్స్లో , క్యూలైన్ల  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేస్తుండాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై ఎటువంటి లోపాలు ఉండకూడాదన్నారు. ఇందుకోసమై స్వచ్ఛందసేవకుల సేవలను వియోగించుకోవాలన్నారు.

క్యూలైన్లన్నీ ధృడంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు (మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు) అవసరమైన అన్ని మరమ్మతులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు.

తనిఖీ జాబితాను( చెక్స్ట్ ) రూపొందించుకుని అన్ని గదులు, కాటేజీలలో ఆయా ఏర్పాట్లను సరిచూసుకోవాలని వసతివిభాగాన్ని ఆదేశించారు.

అవకాశం మేరకు క్షేత్ర పరిధిలో అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.

భక్తులరద్దీకనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపర్చుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై గురించి కూడా పలు సూచనలు చేశారు.

పార్కింగు ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచికబోర్డులను అధికసంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాలలో ట్రాఫిక్ నిలచిపోవడంలాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు తగు ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రతావిభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై ముందుస్తుగానే స్థానిక పోలీస్ శాఖవారితో తగు సమన్వయ చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా పాతాళగంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు.

ముఖ్యంగా పాతాళగంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాటు పాతాళగంగమెట్లమార్గములో అవసరమైన మరమ్మతులు మొదలైనవాటిపట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు.

భక్తులరద్దీకి తగినట్లుగా అన్నప్రసాదవితరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛందసేవాసంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

ఈ సమవేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, స్వామివార్ల ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఎం. ఉమానాగేశ్వరశాస్త్రి, అధ్యాపక ఎం. పూర్ణానంద ఆరాధ్యులు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సహాయ ఇంజనీర్లు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.