శ్రీశైలదేవస్థానం: శ్రీశైల క్షేత్ర గ్రామదేవత శ్రీ అంకాళమ్మవారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మవారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపారు.
అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగా రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.
ప్రకృతి శక్తుల కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో ఉంది.
ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. చతుర్బుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపారు. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేషఅభిషేకం అర్చన ను జరిపారు.