శ్రీశైల దేవస్థానం: ప్రతి సత్రం వారు కూడా శుచీ శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు కోరారు. స్థానిక సత్రాలవారితో ఈ ఓ బుధవారం సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అన్ని సత్రాలు కూడా సేవా దృక్పథంతో భక్తులకు సేవలు అందించాలన్నారు. క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, భక్తులకు సదుపాయాల కల్పనలో అన్ని సత్రాల వారు కూడా సహకరించాలన్నారు.సత్రాలకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
ప్రతి సత్రం వారు కూడా శుచీ శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఈ ఓ. సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సత్రాలు వారు కూడా తగినంత మేరకు చెత్తకుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సత్రప్రాంగణాలనే కాకుండా ఆయా సత్ర పరిసరాలను కూడా శుభ్రంగా ఉండేందుకు అన్ని సత్ర యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.శ్రీశైల క్షేత్రంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని చెబుతూ ఆయా సత్రాలలో బసచేసే వారి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా అన్ని సత్రాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
చాలా సత్రాలలో బసచేసేవారు ఎక్కువగా వారి వాహనాలను రహదారుల పైనే పార్కింగ్ చేస్తున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. అందుకే సత్రాలవారు వాహన పార్కింగ్ విషయంలో తగు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఆయా సత్రాలలో బసచేసేవారికి వాహన పార్కింగ్ విషయమై తగు అవగాహనను కల్పించాలన్నారు.
ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అన్ని సత్రాలు వారు కూడా ముందస్తుగానే నీటి ట్యాంకులలో నీటిని నిల్వచేసుకోవాలన్నారు. ఇందుకు తగిన మేరకు నీటి ట్యాంకులు ఏర్పాటు ఉండాలన్నారు. నీటి నిల్వకు తగినట్లుగా దేవస్థానం నీటి సరఫరా చేస్తుందన్నారు.
సమావేశంలో దేవస్థానం ఇంజనీరింగ్, వసతి, పారిశుద్ధ్యం, భద్రతా విభాగం అధికారులు
పాల్గొన్నారు.