శ్రీశైల దేవస్థానం:
- భారీ వర్షాల కారణంగా క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు , స్థానికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు
- వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు నిరంతరం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిర్వహణ
దేవస్థానం డార్మిటరీలో భక్తులకు ఉచిత వసతి కల్పన
పరస్థితులను సమీక్షించిన కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు
భారీ వర్షాల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
పరిపాలనా కార్యాలయ భవనములోని సమావేశ మందిరములో జరిగిన ఈ సమీక్షలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి, ప్రధానార్చకులు, సీనియర్ వేదపండితులు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ వర్షాల సమయంలో దేవస్థానం పరిధిలో తగు సహాయ చర్యలు చేపట్టేందుకు , అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు నిన్న రాత్రి నుంచి అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణములో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు నిరంతరం పని చేస్తుండాలన్నారు.
అదేవిధంగా స్థానికులు , యాత్రికులు అత్యవసర సమయాలలో సంప్రదించేందుకు ఏర్పాటు చేసిన ఫోన్ కనెక్షన్ కూడా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు అందుబాటులో ఉండాలన్నారు ఈ ఓ . స్థానికులు , యాత్రికులు కంట్రోల్ రూములో ఏర్పాటు చేసిన ఫోన్ నెం : 08524 – 293 015 ద్వారా దేవస్థానాన్ని సంప్రదించవచ్చునన్నారు. ఈ ఫోన్ నెంబరును దేవస్థానం ప్రసారవ్యవస్థ (మైకు) ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలన్నారు.
*కంట్రోల్ రూమునకు మూడు షిఫ్టులలో ప్రత్యేక విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగు సమన్వయ చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ.వర్షాలు తగ్గేంతవరకు కూడా పాతాళగంగ మార్గములోని దేవస్థానము డార్మిటరీలో భక్తులకు ఉచిత సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఈ ఉచిత వసతి కల్పన విషయాన్ని దేవస్థానం ప్రసార వ్యవస్థ ( మైకు) ద్వారా భక్తులకు తెలియజేస్తుండాలన్నారు.టూరిస్టు బస్టాండ్ వద్ద డార్మిటరీలలో కూడా వర్షాలు తగ్గేంతవరకు భక్తులకు ఉచిత వసతి కల్పించాలన్నారు.
హాటకేశ్వరం వద్ద యాత్రిక సౌకర్య కేంద్రం వద్ద కూడా వర్షాలు తగ్గేంత వరకు ఉచిత వసతికి ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ.భారీ వర్షాల కారణంగా ఇళ్ళలోకి నీరు చేరుకోవడం వల్ల వంటలు చేసుకునే అవకాశం లేని వారికి దేవస్థానం అన్న ప్రసాద వితరణలో భోజన ప్రసాదాలను ఏర్పాటు చేయాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు.
భారీవర్షాల నేపథ్యంలో యాత్రికులు , స్థానికులు నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు తగు ముందు జాగ్రత్త చర్యలను ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా ( మైకు ద్వారా) భక్తులకు తెలియజేస్తుండాలన్నారు ఈ ఓ.వర్షాల వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతాయని చెబుతూ, చెత్తాచెదారాలను తొలగించడం పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.వర్షాల వలన త్రాగునీరు కలుషితం కాకుండా ఉండేందుకు పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నీటి సరఫరా విభాగాన్ని ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల క్షేత్ర పరిధిలో రహదారులు జలమయమవుతున్నాయని చెబుతూ పాదచారాలు, ఆయా ప్రదేశాలలో గల రహదారులపై మ్యాన్ హోళ్ళను గుర్తించేందుకు వీలుగా అవసరమైనచోట్ల బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దేవస్థానములోని అన్నీ విభాగాలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.