శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రాభివృద్ధి పై మంగళవారం స్థానిక శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.పరిపాలనా కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో కార్యనిర్వాహణాధికారివారు డి. పెద్దిరాజు, ఉపకార్యనిర్వాహణాధికారిణి, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలక్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.శ్రీశైలక్షేత్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కు ప్రత్యేక దృష్టి ఉందని, తదనుగుణంగా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.ఉభయ తెలుగురాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలాల నుండి కూడా భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతోందన్నారు. భక్తులరద్దీకి అనుగుణంగా క్షేత్రంలో మౌలికసదుపాయాల కల్పన పట్ల ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా భక్తులు క్యూ లైన్లలో అధిక సమయం వేచిఉండకుండా సులభతరంగా , సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా దేవస్థాన అతిథిగృహాలు, వసతిగదులలోని సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలన్నారు. చెక్ లిస్టును రూపొందించుకుని ఎప్పటికప్పుడు గదులు, కాటేజీలలోని సదుపాయాల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలన్నారు.
వారాంతపు సెలవురోజులలో, రద్దీరోజులలో క్షేత్రపరిధిలో ట్రాఫిక్ ఐబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతూ, తగు ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు.
రాబోయే యాభైసంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని బృహత్తర ప్రణాళిక ఉండాలన్నారు. బృహత్తర ప్రణాళికను కూలంకుషంగా అధ్యయనం చేసి తగుచర్యలు చేపడతామన్నారు.
సిబ్బంది అందరూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, భక్తులకు సేవలు అందించాలన్నారు. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో క్షేత్రాభివృద్ధికి పాటుపడాలన్నారు.
అదేవిధంగా ఆలయపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలన్నారు.
క్షేత్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు , పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు.
సమావేశంలో ముందుగా కార్యనిర్వాహణాధికారి డి. పెద్దిరాజు మాట్లాడుతూ దేవస్థాన కార్యకలాపాలను వివరించారు. సాధారణ రోజులు, వారాంతపు రోజులు, పర్వదినాలలో భక్తులరద్దీ, భక్తులకు కల్పించబడుతున్న వసతి, దర్శన ఏర్పాట్లు మొదలైన అంశాలను శాసనసభ్యులవారికి వివరించారు.తర్వాత శాసనసభ్యులు అన్నప్రసాదాల వితరణను పరిశీలించారు. అన్నప్రసాద వితరణ భవనంలోనే అన్నప్రసాదాలను స్వీకరించారు.