విత్తనాలను బ్లాక్ మార్కెట్ లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులు

హైదరాబాద్, మే 30 : రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్ లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2 వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్ రావు కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ మాట్లాడుతూ, ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తం లో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాల పంపిణీ లో ఏవిధమైన ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణా లో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని అన్నారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు.

వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని,  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను అక్కడే నియమించాలని సూచించారు. జూన్ మాసాంతం వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్లు ప్రతీ రోజూ విత్తన పంపిణీలపై సమీక్షించడంతోపాటు విధిగా ఆకస్మిక తనికీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించాలని అన్నారు.  రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుండి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాల లభ్యత సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియ చేయాలని సి.ఎస్ అన్నారు.

 జూన్ 2 న జిల్లా కలెక్టర్లచే పతాకావిష్కరణ

తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన, రాష్ట్ర అవతరణకు  అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం, జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలని సి.ఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను  ఆహ్వానించాలని అన్నారు . రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలియాజేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.