శ్రీశైల దేవస్థానం: ప్లాస్టిక్ నిషేధం అమలుకు స్థానిక సత్రాల వారు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ ఓ విజ్ఞప్తి చేసారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
దేవస్థానం – అటవీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.ఇందులో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు స్థానిక సత్రాల వారితో ప్లాస్టిక్ నిషేధంపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సత్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు సత్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అమలుకు స్థానిక సత్రాల వారు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ విషయమై సత్రాలలో వసతి పొందే భక్తులకు సత్ర యాజమాన్యాలు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అదేవిధంగా సత్రాలలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ఈ విషయమై పూర్తి అవగాహనను కల్పించాలన్నారు.అన్ని సత్రాల వారు కూడా విడివిడిగా రెండు చెత్త కుండీలను ఏర్పాటు చేసుకుని తడిచెత్తను, పొడిచెత్తను వేరువేరుగా ఆయా చెత్తకుండీలలో వేయాలన్నారు. దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బంది వీటిని సేకరించి డంప్ యార్డుకు తరలిస్తారన్నారు.
దేవస్థాన పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ ఫోర్కులు, ప్లాస్టిక్ కప్పులు మొదలైన వాటిని పూర్తిగా నిషేధించినట్లు ఈ ఓ తెలిపారు.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళ స్థానంలో మట్టి లేదా స్టీలు లేదా రాగి సీసాలను వినియోగించాలన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగులకు బదులుగా కాగితం, జనపనార, గుడ్డసంచులను వాడాలన్నారు. ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో అరటిఆకులు, విస్తరాకులు, వక్కచెట్ల బెరుడుతో చేసిన ప్లేట్లు మొదలైనవాటిని వినియోగించవచ్చునన్నారు.భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం పలుచోట్ల మొత్తం 30కి పైగా ఉచిత వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు.ఇప్పటికే ఈ విషయమై దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా , క్షేత్రపరిధిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా స్థానికులలోనూ, భక్తులలోనూ అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలను ఎంతో వివరంగా తెలియజేశారు ఈ ఓ. పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్ వినియోగం ఒకటని అన్నారు. ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ పళ్ళాలు మొదలైన వాటిని వాడి విచ్చలవిడిగా పడివేయడం వల్ల అవి నేల కాలుష్యానికి, నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. భూమిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభవాన్ని చూపిస్తాయన్నారు. మిగిలిపోయిన ఆహారం లేదా ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసిపోయిన ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన అవి జబ్బుల బారిన పడుతాయన్నారు. ఒక్కొక్కసారి అకాల మరణాన్ని కూడా పొందుతాయన్నారు. వినియోగించిన ప్లాస్టిక్ వస్తువులను సరిగ్గా పారవేయకపోవడం వలన అవి మురుగునీటి వ్యవస్థలో పడి మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతాయన్నారు. దాంతో అపరిశుభ్రవాతావరణం ఏర్పడి రోగకారకమైన సూక్ష్మక్రీములు ప్రబలుతాయన్నారు. ప్లాస్టిక్ పునర్వినియోగ సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తుందన్నారు.
అందుకే పర్యావరణ పరిరక్షణకు , వన్యప్రాణుల సంరక్షణకుగాను దేవస్థాన పరిధిలో ప్లాస్టికును పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు ఈ ఓ.ఇప్పటికే ఈ విషయమై దేవస్థానం – అటవీశాఖ మధ్య పలు సమావేశాలు కూడా జరిగాయన్నారు. గత సంవత్సరం నవంబరు మాసములోనే దేవస్థానం పరిపాలనా భవనములో ప్లాస్టిక్ వాడక నిషేధంపై స్థానిక వ్యాపారులకు, హోటళ్ళ నిర్వాహకులకు అవగాహన సమావేశం నిర్వహించిందన్నారు. ఈ సమావేశంలో విషయ నిపుణులు ప్లాస్టిక్ వాడకంపై అనర్థాలు, ప్లాస్టిక్ స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయాల గురించి అవగాహన కల్పించామన్నారు.
సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, పారిశుద్ధ్య , రెవెన్యూ సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, భద్రతా విభాగపు పర్యవేక్షకులు అయ్యన్న, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు శివప్రసాద్, సహాయ ప్రజాసంబంధాల అధికారి శివారెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.