శ్రీశైల రామాలయం లో శ్రీ సీతారామస్వామివార్ల కల్యాణ మహోత్సవం
శ్రీశైల దేవస్థానం:శ్రీరామనవమి సందర్భంగా బుధవారం దేవస్థానం అనుబంధ
దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలోని రామాలయములో
శ్రీ సీతారామస్వామివార్ల కల్యాణమహోత్సవం జరిగింది. ఉదయం సీతారాములవారికి, ఆంజనేయస్వామివారికి
విశేష పూజాదికాలు జరిపారు. తరువాత ఉదయం సీతారాముల కల్యాణోత్సవం జరిపారు.
కల్యాణ మహోత్సవంలో, ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి
వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో
తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని,
దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరు
సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం
పఠించారు. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం చేసారు.
ఆ తరువాత కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర
సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీసీతాదేవివారికి మాంగల్యధారణ,
తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపారు.
కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
కల్యాణోత్సవంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజీనీరు
వి.రామక్రిష్ట ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాస్, అర్చక స్వాములు, వేదపండితులు
పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment