3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పందం

  • మెహదీపట్నంలో స్కై వాక్
  • రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం
  • హైదరాబాద్ సిటీ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవటంతో స్కై వాక్ పనులు నిలిచిపోయాయి. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోయింది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. అక్కడున్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాల్సిన అవసరాన్ని వివరించటంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడున్న ఢిఫెన్స్ జోన్ కు ఇబ్బంది లేకుండా  కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కై వే డిజైన్ లో సీఎం పలు మార్పులు చేయించారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు.

స్కై వే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3380 చదరపు గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మరి కొంత స్థలానికి పదేండ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది.

దీంతో మెహదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. ముంబాయి హైవే లో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. వీలైనంత వేగంగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని  ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్
  • దామగూడెం ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూముల బదిలీ
  • సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావికా దళం అధికారుల భేటీ

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో  వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం  వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.

దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది.

2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.  పర్యావరణ అనుమతులు,  క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా  భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్ వో,  నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.

2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని  కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది.

ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో  దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది.

  • బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో ముఖ్యమంత్రి భేటీ
  • లండన్ పర్యటనపై ముచ్చటించిన సీఎం

లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును  ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది  పునరుజ్జీవింపజేసేందుకు  చేస్తున్న ప్రణాళికలను,  ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి,  తదితర అంశాలను ఆయనతో చర్చించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో భేటీ అయ్యారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత  ప్రాధాన్యమిస్తున్నట్లు,   నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.

సీఎం దార్శనికతకు, నది పరీవాహిక ప్రాంత అభివృధి చేపట్టటం పట్ల బ్రిటిష్ హై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్  డెవలప్మెంట్, ఎకో టూరిజం కు  తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు.  ఈ సమావేశంలో  ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి,  డిప్యూటీ హై కమిషనర్  గారేత్ వైన్ ఒవేన్ తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.