అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలి

హైదరాబాద్, జనవరి 23 :: ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్  తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు.

అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహాలక్ష్మి కార్యక్రమం అమలులో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. రవాణా శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంకా ఆస్కారం ఉందని, అంతర్గత ఆదాయం వనరులు పెంపొందించుకునె మార్గాలను కూడా అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి ఆశించిన మేరకు రాబడులు లేనందున, వాస్తవ పరిస్థితిలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్టీసీ ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మెట్రోరైలు తరహలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వివిధ నమూనాలను అధ్యయనం చేయాలని రవాణా శాఖ అధికారులను కోరారు.

బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన కోరారు.

మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల కొత్త బస్సులను కొనుగోలు చేయల్సిన అవసరం ఏర్పడిందని అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్లు కూడా చేపట్టాలని డిమాండ్‌ ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, కల్యాణలక్ష్మి, స్కాలర్‌షిప్‌లు, వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌లకు ఆర్థిక సహాయం శాఖ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

బీసీ గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని కోరారు. కుల వృత్తుల్లో ఉన్నవారికి స్కిల్  డెవలప్మెంట్   లో శిక్షణ ఇచ్చేందుకు అధ్యయనం చేయాలని సూచించారు.

ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బీ వెంకటేశం, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.