శ్రీశైల దేవస్థానం:మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవం నిర్వహించారు.ఈ ఉత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి (కుమారస్వామివారికి) విశేష అభిషేకం, విశేష అర్చనలు తదితర కార్యక్రమాలు జరిపారు. శ్రీ సుబ్రహ్మణ్యహోమం కూడా జరిపారు.
లోకకల్యాణం కోసం ప్రతి మంగళవారం, షష్ఠి , కృత్తికా నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు.అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆర్జితసేవగా వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం
జరుపుతున్నారు.
ఈ పూజాదికాలకు ముందు లోక క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. దేశం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ సంకల్పంలో కోరారు.సంకల్పం తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు
మహాగణపతిపూజ జరిపారు.తరువాత పంచామృతాలతోను గంధోదకం, భస్మోదకం, బిల్వోదకం, పుష్పోదకం , మల్లికాగుండంలోని పుణ్యజలంతో సుబ్రహ్మణ్యస్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి పూజాదికాలు జరిపారు. తరువాత సుబ్రహ్మణ్యహోమం జరిగింది.
శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సత్సంతానం కలుగుతుందని, అదేవిధంగా వివాహం కానివారికి వివాహయోగం సిద్ధిస్తుందని, గ్రహదోషాలు ముఖ్యంగా రాహు, కేతు, కుజదోషాలు , సర్పదోషాలు నివారణ జరుగుతుందని నమ్మకం. ఋణబాధలు తీరి, శత్రుబాధలు తొలగిపోతాయని, న్యాయవివాదాలలో విజయం లభిస్తుందని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరి కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
*Sahasra Deeparchana Seva, Vendi Rathotsava Seva performed in the temple. EO and others participated in the puuja.