శ్రీశైల దేవస్థానం:దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మంగళవారం కాపవరపు సుబ్బారావు , బృందం, పెద అమిరం, పశ్చిమగోదావరి జిల్లావారు శివతాండవ శబ్దరూపక కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద రాత్రి 7.30ని||ల నుండి ఈ శివతాండవ శబ్దరూపకం కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ మృదంగ విద్వాంసులైన సుబ్బారావు ఐదు మృదంగాలతో ఆయా శివతాండవాలను శబ్దరూపకంగా విన్యసింపచేసారు.
దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పరమశివుని సప్తతాండవాలు అనగా ఆనందతాండవం, సంధ్యాతాండవం, ఉమాతాండవం, కాళికాతాండవం, విజయతాండవం, ఊర్థ్వతాండవం, సంహార తాండవాలను శబ్దరూపకంగా విన్యసింపచేసారు.
ఈకార్యక్రమంలో సందర్భనుసారంగా శివస్తోత్రాలు కూడా పఠించారు.ఈ కార్యక్రమానికి ఎం. రాంబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కె. విజయలక్ష్మి రమ, జయలక్ష్మి సుజల, ప్రసన్న, రంగ తదితరులు గాయనీగాయకులుగా వ్యవహరించారు.
వయోలిన్ సహకారాన్ని పి. దక్షిణామూర్తి, వేణుగాన సహకారాన్ని కుమార్ బాబు, తబలా సహకారాన్ని లక్ష్మీనారాయణ, డోలు సహకారాన్ని నరేష్ కుమార్, కీబోర్డు సహకారాన్ని శివకుమార్ అందించారు.