శ్రీశైలదేవస్థానం:కార్తీక మాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
అయ్యాయి.ఇందులో భాగంగా శుక్రవారం మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు ఆదిశంకరుల వారు రచించిన ‘భ్రమరాంబాష్టకం’ పై ప్రవచనం చేసారు. ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతిప్రజ్వలన జరిగింది. గరికిపాటితో పాటు కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసారు.
భక్తుడిని భగవంతుడు ఎళ్లవేళలా రక్షిస్తుంటాడని గరికిపాటి అన్నారు. ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని అంతా కూడా కాపాడుతుంటారన్నారు.అదేవిధంతమ ప్రసంగంలో శివారాధన విశేషాలను వివరించారు. భక్తులు శివారాధనలో ఆత్మానందాన్ని పొందగలగాలన్నారు. శివతాండవ విశేషాలను కూడా వివరించారు.ప్రవచనంలో భాగంగా శ్రీశైలక్షేత్ర ఆది దేవతలైన శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల నామవైభవం, లీలావైభవం, స్వామిఅమ్మవార్ల మహిమావిశేషాలు, శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం మొదలైన అంశాలను వివరించారు.
భ్రమరాంబాష్టకంలోని ప్రత్యేకతలు, విశేషాలు మొదలైన అంశాలను తెలియజెప్పారు. ప్రవచనం ముగిసిన తరువాత డా. గరికిపాటికి దేవస్థానం తరుపున వేదాశీర్వచనంతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.