శ్రీశైల దేవస్థానం:హిందూ ధర్మప్రచారం లో భాగంగా దేవస్థానం నిర్వహించిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ‘శ్రీశైల మహిమా విశేషాలు’ ప్రవచనాలు సోమవారం ముగిసాయి.తొమ్మిది రోజులపాటు జరిగిన ఈ ప్రవచనాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమయ్యాయి.
శ్రీస్వామిఅమ్మవార్ల ఆవిర్భావం, పర్వతుని వృత్తాంతం, చంద్రవతి వృత్తాంతం, వసుమతి కథ, అరుణాసుర సంహారం, శ్రీశైలక్షేత్ర మాహాత్మ్యం, శ్రీశైలంలోని దివ్యస్థలాలు, దివ్యతీర్థాలు , ఆయా స్థలాల తీర్థాల మహిమ, శ్రీశైల శిఖరదర్శన ఫలం, ఆయా మాసాలలో క్షేత్రాన్ని దర్శించడం వలన కలిగే ఫలితాలు, శ్రీస్వామిఅమ్మవార్లను సేవించిన మహాభక్తులగాథలు, ఆయా కావ్యాలలో ప్రస్తావించబడిన శ్రీశైలమహిమ, పాతాళగంగ మహిమ, త్రిఫలవృక్ష మహిమ తదితర అంశాలను సామవేదం వివరించారు.అదేవిధంగా స్కాందపురాణములోని శ్రీశైలఖండంలో పేర్కొనబడిన క్షేత్ర మహిమా విశేషాలను ఎంతో విస్తారంగా వివరించారు. ఈనాటి ప్రవచనములో శ్రీశైలద్వార క్షేత్రాలు, ఉపద్వార క్షేత్రాలు, వాటి మహిమ, ఆయా ద్వారక్షేత్రాలలోని తీర్థాల విశేషాలు, శ్రీశైలగిరి ప్రదక్షిణ విధానం మొదలైన అంశాలను తెలియజెప్పారు. భూమండలంలోని తీర్థాలన్నీ శ్రీశైలక్షేత్రములో మూర్తులు దాల్చి ఉన్నాయనడంలో సందేహం లేదన్నారు. ముల్లోకాలలో ఉన్న తీర్థక్షేత్ర శక్తులన్నీ కూడా శ్రీశైలంలో ఉన్నాయన్నారు. అందుకే శ్రీశైలానికి సమగ్రక్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు.
పాల్కురికి సోమనాథకవి పండితారాధ్యల చరిత్రలోని పర్వత ప్రకరణంలో శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన ఎన్నో అద్భుత విషయాలు చెప్పారన్నారు.ఈ క్షేత్రాది దేవుడైన మల్లికార్జునుడు ప్రసన్నంగా భక్తులపట్ల అనుగ్రహభావనతో ఉంటాడన్నారు. ఆధ్యాత్మిక సాధనకు శ్రీశైలక్షేత్రం ఎంతో అనువైనదన్నారు. సామాన్యులు సైతం సాధనగమ్యానికి చేర్చగలిగే అద్భుత శక్తి శ్రీశైలక్షేత్రానికి ఉందన్నారు.అందుకే యుగయుగాల నుంచి కూడా ఎందరెందరో ఆర్షపథగాములకు శ్రీశైలమే స్థావరమైందన్నారు.
- EO Inviting Deputy Chief Minister & ENDOWMENT MINISTER For Dasara Uthsavams
- *EO Inviting Forest Minister For Dasara Uthsavams
- Vendi Rathotshava Seva, Sahasra Deeparchana Seva performed in the temple.