శ్రీశైల దేవస్థానం:పరిపాలనా అంశాల పరిశీలనలో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఆలయ ముందు భాగంలో ప్రధాన రహదారులను పరిశీలించారు. రథశాల నుండి పోస్ట్ ఆఫీస్ రోడ్డు, అదే విధంగా రథశాల నుండి నంది మండపం రోడ్లను పరిశీలించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా దుకాణాలను తొలగించిన ఈ ప్రదేశంలో త్వరలో సాల మండపాలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఈ రహదారులను పరిశీలించారు.తరువాత గ్రామ దేవత అంకాలమ్మ ఆలయాన్ని పరిశీలించారు. అంకాలమ్మ ఆలయానికి అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంకాలమ్మ ఆలయ ప్రాంగణంలో బండ పరుపునకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
తరువాత యాత్రిక సముదాయ కేంద్రంలోగల సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయాన్ని ఈ ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అధిక సమయం వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు గదులను కేటాయిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా ఖాళీ అయిన గదులను ఎటువంటి ఆలస్యం లేకుండా శుభ్రం చేయిస్తుండాలని, దీని వలన గదులను భక్తులకు వెంటనే కేటాయించే వీలు గలుగుతుందన్నారు.తరువాత కేంద్ర విచారణా కార్యాలయంలో సమాచారాలు తెలిపే మరిన్ని సూచక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధర్ రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు (ఐ/సి) పి. చంద్రశేఖరశాస్త్రి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వరుణ జపాలు:
వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం వరుణ హోమాలను, వరుణ జపాలను జరిపించింది.వరుణ దేవుని అనుగ్రహం వలన తగినంత వర్షాలు కురుస్తాయని ప్రతీతి.గత నెల 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. శనివారంతో ఈ జపాలు హోమాలు ముగిశాయి. ఈ సందర్భంగా యాగ పూర్ణాహుతి జరిగింది.
ఈ రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో నూతన వస్త్రాలు, పలుసు గంధద్రవ్యాలు మొదలైనవి యజ్ఞగుండంలో ఆహుతిగా సమర్పించారు.
కాగా ఈ జపాల సమయంలో శ్రీశైలంలో హఠాత్తుగా భారీ వర్షం కురవటం విశేషం. ఈ రోజులలో శ్రీశైలంలోనే కాకుండా పలు ఇతర చోట్ల కూడా వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. వరుణ జపాల సమయములో వర్షం కురియడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామీ, అధ్యాపక పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు. ప్రతి రోజు జరిగిన ఆయా కార్యక్రమాలలో పలువురు అర్చకులు, పలువురు ఇతర వేదం పండితులు పాల్గొన్నారు. దేవస్థాన అర్చక స్వాములు, వేదపండితులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- Traditional dance performed in the kalaradhana dias.
- ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈరోజు శ్రీ భవాని క్లాసికల్ డాన్స్ అకాడమి, సిద్ధిపేట వారు ఆంధ్రనాట్యం కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో వినాయకౌత్వం, గణనాయక, శివాష్టకం, శివస్తుతి, భో.. శంబో, ఓం నమ:శివాయా తదితర గీతాలకు హర్షిత, అపర్ణ, నిత్య, హారిక, మధుళిక, నందిత, లక్ష్మీ, దీపిక, శ్రీవల్లి, కీర్తి, శ్రీమతి భవాని, సంధ్య, రమ్య, మాన్విత, ఆరాధ్య తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.