- – దోర్బల బాలశేఖరశర్మ
గచ్చిబౌలి(హైదరాబాద్) లోని గోపన్నపల్లి జర్నలిస్ట్స్ కాలనీని ఆనుకొని సుమారు తొమ్మిది ఎకరాల సువిశాల ప్రదేశంలో, అన్ని ఆధునిక హంగులు, సౌకర్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్మించిన ‘బ్రాహ్మణ సంక్షేమ సదనం’లోని (సెంట్రల్ ఎసి) కళ్యాణ మండపాన్ని కేవలం ఒక్క బ్రాహ్మణులకే కాకుండా అవసరాల్నిబట్టి బ్రాహ్మణేతరులకూ వినియోగానికి ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు, పూర్వ ఐ.ఎ.ఎస్. అధికారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవి రమణాచారి ప్రకటించారు.ఇందుకు నామమాత్రపు అద్దె (ఒక రోజుకు రూ. 50,000 మాత్రం) చెల్లిస్తే సరిపోతుందని ఆయన అన్నారు.
దారిద్ర్యరేఖకు దిగువన వున్న నిరుపేద బ్రాహ్మణులకు ఫంక్షన్ హాలు పూర్తి ఉచితంగా ఇవ్వడమేకాక కరెంటు, వాటర్ వంటి చార్జీలు కూడా వారు చెల్లించవలసిన అవసరం వుండదని ఇవాళ పొద్దున ‘సదనం’లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేవి రమణాచారి వెల్లడించారు. ఆర్థికంగా దారిద్ర్యరేఖకు పైన వున్న బ్రాహ్మణులకు అత్యంత చౌకగా (రోజుకు కళ్యాణ మండపానికి కేవలం రూ. 10,000 మాత్రమే, కరెంటు, వాటెర్ వంటి అదనపు చార్జీలు) అందించనున్నామని అన్నారు. కళ్యాణ మండపానికి వధూవరుల గదులు, అతిథులకు ప్రత్యేక అదనపు గదులు కూడా అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు. బుకింగ్ కేవలం ఆన్ లైన్ లో మాత్రమే చేసుకోవాల్సి వుంటుందని, పరిషత్ వెబ్ సైట్ లో ఈ సౌకర్యం త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చైర్మన్ రమణాచారి తెలిపారు.